
జిల్లాలో వేగంగా జల్‌జీవన్ మిషన్ పనులు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కేంద్ర అధికారులకు వివరించారు. జలజీవన్ మిషన్ పథకం అమలు ప్రక్రియ, పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై గురువారం న్యూఢిల్లీ నుంచి ప్రాజెక్టు అమలు జరుగుతున్న రాష్ట్రాలలోని జిల్లాల కలెక్టర్లతో కేంద్ర జల జీవన్ మిషన్ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు నగరంలోని కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రూ.6,100 కోట్ల నిధులతో జిల్లాలోని 16 మండలాలు, కృష్ణాజిల్లాలోని 24 మండలాలు, ఏలూరు జిల్లాలోని పది మండలాలు మొత్తం 50 మండలాలను కలిపి వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి తాగునీరు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రూ.2వేల కోట్ల నిధులతో 337 పనులు జరుగుతున్నాయని, ఇవి వచ్చే ఆగస్టు నాటికి పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పులిచింతల నుంచి నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని గ్రామాలకు, ఇబ్రహీంపట్నం వద్ద వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ నుంచి మైలవరం, జి.కొండూరు, తిరువూరు, ఎ.కొండూరు మండలాలలోని వివిధ గ్రామాలలకు, గొల్లపూడి వద్ద నుంచి ఏలూరు జిల్లాలోని 10 మండలాలు, కృష్ణాజిల్లాలోని 24 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట, జి.కొండూరు మండలాల్లోని వివిధ గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే కార్య క్రమానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎస్.విద్యాసాగర్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ
కమిటీల నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణాజిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలలో నియమించారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కాగిత జవహర్‌లాల్ నెహ్రూ(మచిలీపట్నం), జాయింట్ సెక్రటరీలుగా జంపాన కొండలరావు(పెనమలూరు), అత్తలూరి రెహమాన్( పెడన)లను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.