
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తలనీలాలను సమర్పించి, ఘాట్‌రోడ్డు, మహా మండపం మీదుగా ఆలయానికి చేరుకున్నారు. సర్వదర్శనానికి గంటన్నర సమయం పట్టింది. మరో వైపున రూ. 100, రూ.300, రూ.500 టికెట్ క్యూలైన్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కనిపించింది. అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు గాను మధ్యాహ్నం 12 గంటలకు అన్ని దర్శనాలు నిలిపివేశారు.
ఆర్జిత సేవలకు డిమాండ్..
శుక్రవారం, ఏకాదశిని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున ఖడ్గమాలార్చనకు 23 మంది ఉభయదాతలు హాజరు కాగా, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీ హోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చనకు ఈవో శీనానాయక్ దంపతులు హాజరయ్యారు.