
దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ తీగె తగిలి మృతి
కంచికచర్ల: ఇంటి ముందు ఉన్న తీగైపె ఉతికిన దుస్తులు ఆరేసే క్రమంలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన కంచికచర్లలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బి.రాజు కథనం మేరకు కంచికచర్ల ప్రణీత కాలనీకి చెందిన చమ్మేటి నందిని(24) ఇంటి ముందు దుస్తులు ఆరేసే తీగైపె బుధవారం రాత్రి ఈదురుగాలులకు విద్యుత్ తీగె తెగి పడింది. ఇది గమనించని నందిని యథావిధిగా రోజూలాగానే ఉతికిన దుస్తులను తీగైపె ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను వైద్య చికిత్స కోసం స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలికి భర్త, కుమారుడు ఉన్నారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.