
సీహెచ్‌ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్‌ఓ)కు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.సందీప్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీహెచ్‌ఓలు బుధ వారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సందీప్ కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను పర్మినెంట్ చేయాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, రద్దు చేసిన ఈఎఫ్‌పీఓను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి సీహెచ్‌ఓలను మినహాయించాలని, హెచ్‌ఆర్ పాలసీతోపాటు ట్రాన్స్‌ఫర్, ఇంక్రిమెంట్, ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, సీహెచ్‌ఓలకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అసోసియేషన్ ప్రతినిధులు, సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్