
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం
– మంత్రి కొల్లు రవీంద్ర
ఐనంపూడి(పామర్రు): రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విప్లవం మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఐనంపూడి గ్రామంలో రూ.11.26 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణానికి కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మతో కలిసి ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పురోభి వృద్ధికి అడుగులు పడ్డాయన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణ పను లను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షుడు వల్లూరిపల్లి గణేష్, కెదరవల్లి ప్రవీణ్‌చంద్ర, మాజీ సర్పంచ్ బొప్పన భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త రేషన్‌కార్డులకు
దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు జారీ కోసం అర్హులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ బుధవారం సూచించారు. కొత్త బియ్యం కార్డుల జారీతో పాటు కార్డులో సభ్యుల చేర్పులు, కార్డుల విభజన, సభ్యుల తొలగింపు, కార్డు సరెండర్, చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ సర్దుబాటు సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. సమీపంలోని సచివాలయాల ద్వారా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించి వారికి కావాల్సిన సేవలు పొందాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.