ప్రజారోగ్యంపై సమ్మెట | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై సమ్మెట

May 7 2025 2:25 AM | Updated on May 7 2025 2:25 AM

ప్రజా

ప్రజారోగ్యంపై సమ్మెట

లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వ మొండి వైఖరితో పల్లె వైద్యం పడకే సింది. గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటూ, వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీ సర్లు (సీహెచ్‌ఓలు) నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో గ్రామాల్లోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్లు)లో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇప్పటి వరకూ అనేక మంది గ్రామీణులు తమ ఇంటికి సమీపంలోనే ఉన్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌కు వెళ్లి పలు రకాల వైద్య సేవలు పొందేవారు. పాముకాటు, విషం తాగడం వంటి వాటికి తక్షణ ప్రాథమిక వైద్యం అందించేలా సీహెచ్‌ఓలు ప్రత్యేక శిక్షణ పొందారు. అవసరమైతే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ నుంచే నిపుణులతో టెలిమెడిసిన్‌లో సంప్రదించి రోగులకు అవసరమైన మందులు అందించేవారు. ఇప్పుడు ఆ సేవలన్నీ నిలిచిపోయాయి. సీహెచ్‌ఓల న్యాయమైన డిమాండ్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చేసేది లేక తమ సమస్యల పరిష్కారం కోసం సీహెచ్‌ఓలు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో ఎన్టీఆర్‌ జిల్లాలోని 257, కృష్ణా జిల్లాలోని 357 వెల్నెస్‌ సెంటర్లలో వైద్య సేవలు నిలిచిపోయాయి.

కీలకంగా వెల్నెస్‌ సెంటర్లు

కరోనా తర్వాత విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వైద్య సేవలు అందించడంలో కీలకంగా మారాయి. అక్కడ బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారికి సీహెచ్‌ఓలుగా పోస్టింగ్‌ ఇచ్చారు. అంతేకాకుండా అత్యవసర సమయంలో అందించాల్సిన ప్రాథమ చికిత్సలపై కూడా వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పాము కాటు, పాయిజన్‌ వంటి కేసులు వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లే సమయానికి చేయాల్సిన తక్షణ వైద్యంపై వారికి తర్ఫీదు ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వారికి పరీక్షలు నిర్వహించడం మందులు ఇవ్వడం వంటివి సీహెచ్‌ఓలు చేస్తున్నారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌కు వైద్యం కోసం వచ్చిన రోగులకు టెలిమెడిసిన్‌ ద్వారా నిపుణులైన వైద్యులతో సంప్రదించి మందులు అందిస్తున్నారు. ఇలా ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో ఒక వెల్నెస్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి బుధ, శనివారం గర్భిణులు, బాలింతలకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా అక్కడే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవలు నిలిచిపోయాయి.

సీహెచ్‌ఓల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం నిరవధిక సమ్మెబాట పట్టిన సీహెచ్‌ఓలు వెల్నెస్‌ సెంటర్లలో నిలిచిన వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందని అత్యవసర ప్రాథమిక వైద్యం

సీహెచ్‌ఓల డిమాండ్లు ఇవీ..

ఆయుష్మాన్‌ భారత్‌ నిబంధనల ప్రకారం ఆరేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని రెగ్యులర్‌ చేయాలి.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి.

పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలి.

ఈపీఎఫ్‌ఓను పునరుద్ధరించాలి

క్లినిక్‌ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి

నిర్ధిష్టమైన జాబ్‌ చార్ట్‌ అందించాలి

ఎఫ్‌ఆర్‌ఎస్‌ నుంచి సీహెచ్‌ఓలకు మినహాయింపు ఇవ్వాలి

హెచ్‌ఆర్‌ పాలసీ, ఇంక్రిమెంట్‌, ట్రాన్స్‌ఫర్‌, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు వంటివి అమలు చేయాలి.

సమస్యలను పరిష్కరించాలి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు అత్యాధునిక భవనాలు నిర్మించడమే కాకుండా, అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించ డంతో సేవలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వైద్య రంగంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు.

– డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌,

రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ వైద్య విభాగం

ప్రజారోగ్యంపై సమ్మెట1
1/1

ప్రజారోగ్యంపై సమ్మెట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement