
ఇంగ్లిష్‌లో ‘పవర్’ చూపించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముంబైలో ఏప్రిల్ 23న నిర్వహించిన జాతీయ స్థాయి ఇంగ్లిష్ వర్డ్ పవర్ చాంపియన్‌షిప్ పోటీలలో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు ప్రతిభకనబరిచారు. దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో మన రాష్ట్రం నుంచి ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. ఈ పోటీల్లో మొత్తం 2 నుంచి 5వ తరగతి వరకు 4 విభాగాలలో పోటీలు నిర్వహించగా, వీటిలో 4వ తరగతి విభాగంలో రేవంత్ ప్రథమ స్థానం, 2వ తరగతి విభాగంలో సింధు ప్రియ ద్వితీయ స్థానం సాధించింది. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. విజేతలు మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. బహుమతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మిని సత్కరించారు.
కాలువలోకి దూకి యువతి ఆత్మహత్య
కోనేరుసెంటర్: ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బందరు మండలం ఎన్. గొల్లపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్. గొల్లపాలెం గ్రామానికి చెందిన కుక్కల విద్య (19) పదో తరగతి వరకు చదువుకుంది. తండ్రి సురేష్ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆమెకు సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు నిర్ణయించాడు. అయితే ఇంకా చదువుకోవాలకునే విద్య విషయాన్ని తండ్రికి చెప్పింది. అందుకు ఆయన నిరాకరించాడు. అంత స్తోమత కుటుంబానికి లేదంటూ బుజ్జగించాడు. తెచ్చిన సంబంధం చేసుకోవాలంటూ ఆదేశించాడు. దీంతో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని విద్య సోమవారం మధ్యాహ్నం తండ్రి బైక్ వేసుకుని బయటికి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవటంతో అనుమానం వచ్చిన తండ్రి గ్రామంలో ఆరా తీశాడు. అతని బైక్ చిన్నాపురం గ్రామ సమీపంలోని గుండేరు వంతెనపై ఉన్నట్లు పరిచయస్తులు చెప్పారు. అక్కడికి వెళ్లి చూడగా బైక్ కనిపించింది. సురేష్ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. పోలీసులు మంగళవారం గుండేరు కాలువలో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్య కాలువలో శవమై కనిపించింది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
ట్రావెల్స్ యజమాని బలవన్మరణం
తోట్లవల్లూరు: అనుమానాస్పద స్థితిలో కార్ ట్రావెల్స్ యజమాని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన పేర్ల సుధాకర్‌రెడ్డి(33) స్థానిక కనకదుర్గమ్మ కాలనీలో మూడేళ్లుగా నివాసం ఉంటున్నాడు. పెనమలూరులో పీఎస్‌ఆర్ ట్రావెల్స్ పేరుతో కృష్ణారెడ్డి అనే వ్యక్తితో కలిసి నిర్వహిస్తున్నాడు. వ్యాపార పనుల నిమిత్తం వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన సుధాకర్‌రెడ్డి ఈ నెల 5 సోమవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చాడు. సుధాకర్‌రెడ్డి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు గమనించారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి పేర్ల రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అవినాశ్ తెలియజేశారు.