
‘ఏఎన్‌ఎంలకు ఏబీసీడీలు రావు’
● సోషల్ మీడియాలో ఓ సీహెచ్‌ఓ పోస్టు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఏఎన్‌ఎంలు ● నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు ● వైద్యశాఖ సిబ్బంది మధ్య కొరవడిన సమన్వయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వంలో వైద్యశాఖ అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య సమన్వయం లోపించడంతో పేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ఏడాదిగా వీరి మధ్య చాపకింద నీరులా ఉన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం అయ్యింది. సిబ్బంది ప్రత్యక్ష ఆరోపణలకు దిగుతున్నారు. అంతేకాక నల్ల బ్యాడ్జిలతో నిరసనలు తెలుపుతూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పరిష్కరించాల్సిన వైద్యశాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు.
సోషల్ మీడియా పోస్టుతో..
ఇటీవల తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్లు పలు డిమాండ్‌లతో నిరవధిక సమ్మెకు దిగారు. వారి సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో ఓ సీహెచ్‌ఓ.. ‘ఏబీసీడీలు రాని ఏఎన్‌ఎంలకు రూ.50 వేలు, సూపర్‌వైజర్‌లకు రూ.70 వేలు, రూ.లక్ష జీతాలు.. గ్రాడ్యుయేషన్ చేసిన మాకు తక్కువ జీతాలా.. ఏఎన్‌ఎంల యాప్‌లు అన్నీ మేమే చూస్తున్నాం, మెడికల్ ఆఫీసర్స్ యాప్‌లు కూడా మేమే చేస్తున్నాం’ అంటూ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసింది. ఎప్పటి నుంచో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓల మధ్య వివాదం నడుస్తుండగా, ఇప్పుడు ఈ పోస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది.
ఏఎన్‌ఎంల నిరసన..
తమకు ఏబీసీడీలు రావంటూ సీహెచ్‌ఓలు అవమానించడంపై ఏఎన్‌ఎంలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా దీనిపై నిరసనలు తెలుపుతున్నారు. సోమవారం నల్ల బ్యాడ్జిలతో విధులకు హాజరైన ఏఎన్‌ఎంలు, మంగళవారం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సీహెచ్‌ఓల తీరు బాగా లేదని, తమకు ఏబీసీడీలు రావనడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రస్తుతం వారి మధ్య వివాదం నడుస్తుండగా, ఇది ఎక్కడి వరకూ కొనసాగుతుందోనని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

‘ఏఎన్‌ఎంలకు ఏబీసీడీలు రావు’