
ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ
బస్సులో మర్చిపోయిన రూ. 1.29 లక్షల నగదు అప్పగింత
బస్టాండ్(విజయవాడపశ్చిమ): బస్సులో మర్చిపోయిన నగదును తిరిగి ప్రయాణికులకు అందించి ఆర్టీసీ ఉద్యోగులు తమ నిజాయితీని చాటుకున్నారు. వివరాలు ఇవి.. సోమవారం రాత్రి కాళేశ్వరరావు మార్కెట్ నుంచి మంగళాపురం వెళ్తున్న రూట్ నెంబర్ 49ఎం బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు రూ.1,29,800 నగదు ఉంచిన బ్యాగును మర్చిపోయి మంగళాపురంలో దిగి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన అనంతరం గుర్తించిన ప్రయాణికులు గవర్నరుపేట–2 డిపో వద్దకు వెళ్లారు. అప్పటికే బస్సులో మర్చిపోయిన బ్యాగును గుర్తించిన కండక్టర్ కుమారి, డ్రైవర్ రాజారావు నగదు కలిగిన బ్యాగును ఇన్‌చార్జ్ డిపో మేనేజర్ కె. బసవయ్యకు అప్పగించారు. ప్రయాణికుల నుంచి వివరాలు తీసుకున్న మేనేజర్ సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో బ్యాగును అందజేశారు.