పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి | - | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి

May 6 2025 1:57 AM | Updated on May 6 2025 1:57 AM

పని ఒ

పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి

లబ్బీపేట(విజయవాడతూర్పు): పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వార్డు సచివాలయ ఏఎన్‌ఎంలు పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్వేలు, కార్యక్రమాలతోనే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, మరోవైపు మునిసిపల్‌ అధికారులు ఆ పన్ను వసూళ్లు, ఈ పన్ను వసూళ్లు అంటూ సంబంధం లేని పనులు చెబుతుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రతి సచివాలయంలో ఒక్కో ఏఎన్‌ఎం విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిత్యం ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ పనిచేసినా వారికిచ్చిన టార్గెట్‌లు పూర్తికావడం లేదు. దీంతో ఇదేమి ఖర్మ అంటూ తమను తామే నిందించుకుంటున్నారు. తమను వైద్యశాఖకే పరిమితం చేయాలంటూ వేడుకుంటున్నారు.

నిముషం తీరిక లేక..

ప్రస్తుతం ఏఎన్‌ఎంలకు దాదాపు 30 రకాల యాప్‌లు ఇచ్చారు. వాటిలో నిత్యం సమాచారాన్ని నిక్షిప్తం చేయాల్సి ఉంది. ఒక్కోసారి నెట్‌వర్క్‌ పనిచేయక చికాకు తెప్పిస్తోంది. గర్భిణుల గుర్తింపు, హైరిస్క్‌ గర్భిణుల పర్యవేక్షణ, డ్రైడే ఫ్రైడే, ఆశ డే, వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ వంటి వాటితో పాటు, ఎన్‌సీడీ–సీడీ సర్వే ప్రతిరోజూ ఇంత మందిని చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్కరినీ రెండు వందల ప్రశ్నలు అడిగి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్కరికీ 45 నిముషాల వరకూ సమయం పడుతుంది. కుటుంబంలో ముగ్గురు, నలుగురు ఉంటే అక్కడే రెండు గంటల సమయం సరిపోతుంది. దీంతో మిగిలిన కార్యక్రమాలు చేయలేక పోతున్నారు.

మునిసిపల్‌ అధికారుల వేధింపులు..

వైద్యశాఖ కార్యక్రమాలతోనే ఏఎన్‌ఎంలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, మరోవైపు మునిసిపల్‌ అధికారులు సైతం సచివాలయ ఏఎన్‌ఎంలకు పలు పనులు అప్పగిస్తున్నారు. ప్రతిరోజూ గంట పాటు వారితో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ టార్గెట్‌లు పెడుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్ను వసూళ్లు కూడా తామే చేయాలంటున్నారంటూ చెబుతున్నారు. ఈ ఉద్యోగం తాము చేయలేమంటూ ప్రత్యామ్నాయం చూసుకుంటున్న వారు ఉంటున్నారు.

పట్టణ ప్రాంత ఏఎన్‌ఎంల ఆవేదన ఒకవైపు సర్వేలు, మరోవైపు పన్ను వసూళ్లు అసలు తాము ఎవరి పరిధిలో పని చేస్తున్నామో తెలియడం లేదంటున్న ఏఎన్‌ఎంలు విజయవాడలో ఓ ఏఎన్‌ఎంకు వేధింపులు

వైద్యశాఖకే పరిమితం చేయాలి..

ప్రస్తుతం ఏఎన్‌ఎంలు విధుల్లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారికి అనేక రకాల యాప్‌లు ఇచ్చి వాటిలో సమాచారం అప్‌లోడ్‌ చేయమంటున్నారు. అంతేకాదు మునిసిపాలిటీల్లో పనిచేసే ఏఎన్‌ఎంలకు వారి పనులు కూడా చెప్పడంతో మరింత ఒత్తిడితో సతమతం అవుతున్నారు. ఏఎన్‌ఎంలను వైద్యశాఖ పరిధిలోనే పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి.

– అంగిరేకుల దుర్గాప్రసాద్‌,

ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

ఇవే నిదర్శనం..

బాపట్ల జిల్లా రేపల్లెలో వార్డు సచివాలయ ఏఎన్‌ఎం పని ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానని, ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందంటూ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉదయం6 నుంచి రాత్రి 10 గంటల వరకూ విధులేనంటూ ఆమె డెత్‌నోట్‌లో పేర్కొంది.

విజయవాడ సింగ్‌నగర్‌ ప్రాంతంలో పనిచేసే ఏఎన్‌ఎం తమకిచ్చిన టార్గెట్‌ పూర్తి కాక పోవడంతో రాత్రి 8 గంటల సమయంలో కూడా ఎన్‌సీడీ– సీడీ సర్వే కోసం ఓ ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో సర్వేలు ఏమిటీ పనిపాట లేదా అంటూ ఒకరు అసభ్యంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలా నిత్యం ఏఎన్‌ఎంలు పని ఒత్తిడితో పాటు, టార్గెట్‌లు రీచ్‌ అయ్యే క్రమంలో అవమానాలకు గురవుతూనే ఉన్నారు.

పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి 1
1/1

పని ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement