
తిరుపతమ్మ ఆలయానికి ట్రాక్టర్ ట్రక్కు బహూకరణ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి సోమవారం పెనుగంచిప్రోలుకు చెందిన కర్ల భాస్కరరావు, పద్మావతి దంపతుల కుమారులు కర్ల రామకృష్ణారావు, వసుంధర దంపతులు, కర్ల శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు రూ.2.50లక్షల విలువైన ట్రాక్టర్ ట్రక్కును బహూకరించారు. గతంలో వీరు ఆలయానికి రూ.10 లక్షల విలువైన ట్రాక్టర్‌ను కూడా అందించారని అధికారులు తెలిపారు. ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలతో సత్కరించారు. ఈఓ కిషోర్‌కుమార్, ఆలయ డైరెక్టర్ బెజవాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
8 నుంచి
చెస్ ఉచిత శిక్షణ శిబిరం
విజయవాడస్పోర్ట్స్: ప్రభుత్వ, మునిసిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గ్లోబల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల ఎనిమిదో తేదీ నుంచి చెస్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ అకాడమీ కార్యదర్శి షేక్ ఖాసీం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమీ పక్కనే ఉన్న తమ అకాడమీలో జూన్ ఎనిమిదో తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 98495 14138 నంబరును సంప్రదించి, పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
గుంటూరు జీజీహెచ్ సిబ్బందికి మెమోలు
గుంటూరు జీజీహెచ్: గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గతంలో నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఆషా సజనిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించారు. అనంతరం ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌లో తనిఖీలు చేసి, ఆపరేషన్ థియేటర్‌లో సక్రమంగా ఓటీ డ్రస్సులు ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత వైద్య సిబ్బంది, వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను ఆదేశించారు. మార్చురీ విభాగంలో తనిఖీలు చేశారు. లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మనోజ్ మార్చురీ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండటంతో అతని ని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించారు. వైద్య విద్యార్థులకు మార్చురీ విభాగంలో క్లినికల్ తరగతులు నిర్వహించేందుకు వసతులు పరిశీలించారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ విభాగంలో వైద్యులు, వైద్య అధికారులతో సమావేశం నిర్వహించి ఆస్పత్రి అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ రిజిస్ట్రారు సుశీల తదితరులు ఉన్నారు.
దక్షిణ భారత టెన్నిస్ బాల్ క్రికెట్ చాంప్ రన్నర్‌గా ఏపీ
విజయవాడస్పోర్ట్స్: దక్షిణ భారత టెన్నిస్ బాల్ క్రికెట్ అండర్–14 బాలుర చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టు రన్నరప్ ట్రోఫీని కై వసం చేసుకుందని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.డి. ప్రసాద్ తెలిపారు. నెల్లూరులో ఇటీవల ఈ పోటీల్లో రాష్ట్ర జట్టు అత్యంత క్రీడా నైపుణ్యం ప్రదర్శించిందన్నారు. ప్రతిష్టాత్మకమైన పోటీ ల్లో ట్రోఫీ సాధించిన జట్టును ఆయన అభినందించారు. ఇదే క్రీడా స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ట్రోఫీ సాధించిన జట్టును ఎన్టీఆర్ జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకృష్ణ, కె.ఎస్.స్వామి అభినందించారు.
రేపటి నుంచి తిరుకల్యాణోత్సవాలు
వేదాద్రి(జగ్గయ్యపేట): వేదాద్రి గ్రామంలో వేంచేసియున్న శ్రీ యోగానంద లక్ష్మినరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. 14వ తేదీ వరకు జరిగే కల్యాణోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ మహోత్సవాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చలువ పందిళ్లు వేశారు.

తిరుపతమ్మ ఆలయానికి ట్రాక్టర్ ట్రక్కు బహూకరణ