
ఉత్తమ ప్రదర్శనగా ‘27వ మైలురాయి’
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీల్లో యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటిక ఉత్తమ ప్రదర్శన బహుమతిని అందుకుంది. ఇదే నాటికలో వైదేహి పాత్రలో నటించిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటి సురభి ప్రభావతి ఉత్తమ నటిగా, రాజన్న పాత్రధారి పవన్‌కుమార్ ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, నాటిక రచయిత పీటీ మాధవ్ ఉత్తమ రచయిత బహుమతులను అందుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన నాటికల పోటీల్లో విజేతలకు చివరి రోజైన ఆదివారం రాత్రి బహుమతులను అందజేశారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి, విశాఖపట్నం వారు ప్రదర్శించి ‘అసత్యం’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు దక్కటం విశేషం. రఘుపతి పాత్రధారి వై.అనిల్‌కుమార్ ఉత్తమ ప్రతినాయకుడు, నాటిక దర్శకుడు పి.బాలాజీనాయక్‌కు, సంగీతాన్ని అందించిన పి.లీలామోహన్‌కు ఉత్తమ సంగీతం, ఉత్తమ లైటింగ్‌కు థామస్ బహుమతులను అందుకున్నారు. తృతీయ ఉత్తమ ప్రదర్శనగా విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటికలో నటించిన గోవాడ వెంకట్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. న్యాయనిర్ణేతలుగా ఆంజనేయులు నాయుడు (పొన్నూరు), చలసాని కృష్ణప్రసాద్ (విశాఖపట్నం), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు) వ్యవహరించారు.