
పెదపులిపాకలో రెండు పడవలు దగ్ధం
పెనమలూరు: పెదపులిపాక గ్రామంలోని రేవు వద్ద ఉంచిన రెండు పడవలు అనుమానాస్పద పరిస్థితుల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పెనమలూరు ఎస్‌ఐ ఫిరోజ్ తెలిపిన వివరాల ప్రకారం పెదపులిపాక గ్రామానికి చెందిన నడకుదురు ఏడుకొండలు, తాడి భాస్కరరావు వారి పడవల్లో కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లి చేపలు పట్టి జీవిస్తుంటారు. వేట అనంతరం పడవలు ఘాట్ వద్ద నది ఒడ్డున ఉంచుతారు. అయితే తమ ఇద్దరి పడవలు కాలిపోతున్నాయని స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఏడుకొండలు, భాస్కరరావు ఘటనా స్థలం వద్దకు వెళ్లి మంటలను ఆర్పే యత్నం చేయగా అప్పటికే పడవలు, మోటర్లు, చేపల వలలు దగ్ధమయ్యాయి. రాత్రి సమయంలో పడవలు ఉన్న ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగి, సిగరెట్ వేయటంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండు పడవలు దగ్ధం కావటంతో రూ.6 లక్షల మేరకు నష్టం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేశారు.