భద్రతేది.. భవానీ? | - | Sakshi
Sakshi News home page

భద్రతేది.. భవానీ?

May 2 2025 1:45 AM | Updated on May 2 2025 1:45 AM

భద్రత

భద్రతేది.. భవానీ?

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కూటమి పాలనలో రాష్ట్రంలో ఆలయాల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సింహాచలం ఘటనతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో భద్రత ఎంత అని పలువురు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సాధారణ రోజుల్లో నిత్యం 30 వేల మందికిపైగా, శుక్ర, శని, ఆదివారాల్లో 60 వేల మందికిపైగా భక్తులు దర్శించుకుంటారు. అయితే ఆలయంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

పని చేయని సీసీ కెమెరాలు

కొండపైకి గత నెల11వ తేదీన ఉత్తరాదికి చెందిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ కాలినడకన చేరుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. గత నెలలోనే ఘాట్‌ రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద నిలిపిన కారులో 272 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం.

కొరవడిన చిత్తశుద్ధి

కొండపైన కింద 220 సీసీ కెమెరాలు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదు. వాటిని పర్యవేక్షించే పరిస్థితిలేదు. దీన్నిబట్టే అధికారులకు అమ్మవారి భద్రతపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోంది. కొంత మంది దేవాలయ అధికారులే దర్శనాల దందా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మొత్తం మీద రెగ్యులర్‌ ఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.

ఈఓ నియామకంలో అలసత్వం

రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యమున్న దుర్గగుడికి ఈఓను నియమించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. దుర్గగుడి ఈఓగా గత ఏడాది డిసెంబర్‌ 31న రామచంద్రమోహన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత దేవదాయ శాఖ కమిషనర్‌గా, అదనపు కమిషనర్‌–2గా రామచంద్రమోహన్‌ను ప్రభుత్వం నియమించడంతో ఆ బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఆయన ప్రభుత్వ పెద్దలు ఆశీస్సులతో ఇక్కడ కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

తూతూమంత్రంగా..

ఈఓగా రామచంద్రమోహన్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆలయంలో జరిగే ఉత్సవాల్లోనూ వైభవం తగ్గిందని సిబ్బందే బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇటీవల మహా శివరాత్రి కల్యా ణోత్సవాలు, చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాల్లో ఈ లోటు స్పష్టంగా కనిపించింది. ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఈఓ పాల్గొనకపోవడంతో తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారని ఉభయదాతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు.

సింహాచలం ఘటనతో దుర్గగుడి భద్రతపై సందేహాలు! సీసీ కెమెరాలు లేక పెరుగుతున్న చోరీలు వారంలో ఒకటి, రెండు రోజులే ఉంటున్న ఈఓ జగన్‌ సర్కార్‌ ఇచ్చిన రూ.72 కోట్ల నిధులతో అనేక భారీ నిర్మాణాలు

వైఎస్సార్‌ సీపీ హయాంలో అభివృద్ధికి పెద్ద పీట

వైఎస్సార్‌ సీపీ సర్కార్‌ హయాంలో దుర్గగుడి అభివృద్ధికి పెద్ద పీట వేశారు. రూ.72 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా దుర్గగుడిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఇంజినీరింగ్‌ పనులను ఈఓ పర్యవేక్షించిన దాఖలాలు లేవు. పనులపై ఇంజినీరింగ్‌ సిబ్బంది పర్యవేక్షణ సైతం కొరవడింది. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. సింహా చలం అప్పన్న సన్నిధిలో జరిగిన ఘటన తర్వాత అయినా ప్రభుత్వంలో మార్పు వస్తుందని భక్తులు భావిస్తున్నారు. రెగ్యులర్‌ ఈఓను నియమించి, దుర్గగుడి అభివృద్ధి పనులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది.

అందుబాటులో ఒకటి, రెండు రోజులే..

ఇన్‌చార్జి ఈఓగా రామచంద్రమోహన్‌ వారంలో ఒకటి, రెండు రోజులే దుర్గగుడిలో అధికారులకు అందుబాటులో ఉంటున్నారు. దేవస్థానానికి సంబంధించి ప్రతి ఫైల్‌ ఈ–ఫైల్‌లో నమోదు చేయాలని చెబుతున్నా.. పూజలు, ఇతర ఆలయ వ్యవహారాలకు ఎప్పుడు అనుమతులు లభిస్తాయో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ఆలయ సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు, కాంట్రాక్టర్లకు బిల్లులూ ఆలస్యమవుతున్నాయి. ఆరు నెలలకు ఒక సారి ఆలయ అధికారులు, ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశాలున్నాయి. దుర్గగుడిలో అంతర్గత బదిలీల ఊసే లేదు. అమ్మవారి ఆదాయానికి భారీగా గండి పడేలా రామచంద్రమోహన్‌ వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సిఫార్సుల దర్శనాలను కట్టడి చేయడంలో రామచంద్రమోహన్‌ పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. సిఫార్సులపై వచ్చే వారిని నియంత్రించలేక, టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సైతం అంతరాలయంలోకి అనుమతించకపోవడంతో ఆలయ అధికారులతో భక్తులు వివాదాలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

భద్రతేది.. భవానీ? 1
1/3

భద్రతేది.. భవానీ?

భద్రతేది.. భవానీ? 2
2/3

భద్రతేది.. భవానీ?

భద్రతేది.. భవానీ? 3
3/3

భద్రతేది.. భవానీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement