
ప్రధాని సభకు జనసమీకరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాన నరేంద్రమోదీ చేతుల మీదుగా శుక్రవారం నిర్వహించే రాజధాని పునఃనిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి భారీ జనసమీకరణ చేస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి లక్ష్యం నిర్దేశించి బస్సులను కేటాయిస్తోంది. విజయవాడ నగరంలోని మూడు సర్కిళ్లకు ఒక్కో సర్కిల్‌కు 50 చొప్పున 150 బస్సులు కేటాయించారు. రూరల్‌లోని 16 మండలాలకు ఒక్కో మండలానికి 45 నుంచి 50 బస్సులు ఏర్పాటు చేశారు. జనసమీకరణ బాధ్యతలు స్థానిక నాయకత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్టు, టెక్నికల్ అసిస్టెంట్లు, వెలుగు బుక్ కీపర్లు, సచివాలయాల ఎంఎస్‌కేలకు అప్పగించారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వారి వివరాలను సేకరించి సిద్ధం చేశారు. ఒక్కో బస్సుకు ఇన్‌చార్జిగా సచివాలయాల పరిధిలో లైజనింగ్ ఆఫీసర్లను నియమించారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యే వారికి అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. చిల్లకల్లు టోల్ ప్లాజా, కొణకంచి అడ్డరోడ్డు వద్ద పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజనం వాటర్ ప్యాకెట్లను సిద్దం చేశారు. ఇబ్రహీంపట్నం అడ్డరోడ్డు వద్ద భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు.
గ్రామాలకు చేరిన బస్సులు
ఇప్పటికే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులు, ప్రైవేటు వాహనాలు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. డ్వామా, మెప్మా, డీఆర్డీఏ సిబ్బంది జన సమీకరణలో తలమునకలయ్యారు. ఉపాఽధి కూలీలు, డ్వాక్రా మహిళలు, రైతులు ఇలా వేర్వేరుగా బస్సులు కేటాయించారు. బస్సులను నింపే బాధ్యత వారికి అప్పగించారు. ప్రధాని పర్యటన కావడంతో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే వారు వెస్ట్ బైపాస్ సర్వీస్ రోడ్డు ద్వారా సభ ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే జనసమీకరణ చేయలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ దఫా అంగన్‌వాడీ వర్కర్లను కార్యక్రమానికి దూరంగా ఉంచడం విశేషం
భారీగా బస్సులు ఉపాఽధి కూలీలను, డ్వాక్రా మహిళలను తరలించడానికి సన్నాహాలు