
కనకమహాలక్ష్మి బ్యాంకులో ఘరానా మోసం
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కోఆపరేటివ్ బ్యాంక్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. నగరంలోని ఆజాద్ రోడ్డులో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి కో–ఆపరేటివ్ బ్యాంకు ప్రైవేటు లిమిటెడ్‌లో రాజుపేటకు చెందిన గుడిసేవ సునీత అనే మహిళ గత సంవత్సరం మే నెలలో నాలుగు బంగారపు గాజులు తాకట్టు పెట్టి రూ.2.40 లక్షలు అప్పుగా తీసు కుంది. తాకట్టు సమయంలో ఒకటికి రెండుసార్లు గీటురాయితో, యాసిడ్‌తో తనిఖీ చేసుకున్న బ్యాంకు అప్రైజర్ ఈ బంగారం మంచిదేనని నిర్ధారించటంతో యాజమాన్యం ఆమెకు గోల్డ్‌లోన్ మంజూరుచేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకు అధికారులు సునీత ఇంటికి వెళ్లి గత ఏడాది మీరు బ్యాంకులో పెట్టిన నాలుగు గాజులు నకిలీవని తేలిందని, వెంటనే వాటిని విడిపించుకుని తీసుకువెళ్లాలని సూచించారు. అయితే తాను పెట్టింది స్వచ్ఛమైన బంగారమని నిర్ధారించే రుణం ఇచ్చారని, ఇప్పుడు అవి నకిలీవని ఎలా చెబుతారని సునీత వారిని ప్రశ్నించింది. ఆడిటింగ్‌లో సుమారు 25 ఖాతాలకు చెందిన బంగారం నకిలీవని తేలిందని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆమె విస్తుపోయింది. అప్రైజర్, బ్యాంకు అధికారులు కుమ్మక్కై తన బంగారం కాజేశారని దీనిపై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా బ్యాంకు వారు చెప్పినట్లు చేసి వ్యవహారం సరిచేసుకోవాలని సూచించారని తెలిపింది. బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్‌పై పలు బ్యాంకులను మోసం చేసిన కేసులు ఉన్నాయని, ఈ మధ్యే అతనిపై దొంగ నోట్ల కేసు కూడా నమోదైందని ఆమె తెలిపారు. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నాగేశ్వరరావును వివరణ కోరగా అప్రైజర్, సునీత కుమ్మకై ్క రుణం తీసుకున్నారని చెప్పారు. పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తే, వారు పిల్లలు కలవారని కేసు వరకు వెళ్లలేదని బదులివ్వడం గమనార్హం. బ్యాంకులో 25 ఖాతాలకు సంబంధించి దాదాపు రూ.40 లక్షల మేరకు గోల్‌మాల్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకు పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందనే ఉద్దేశంతో పోలీసు కేసు పెట్టలేదని, ఈ మొత్తం అప్రైజర్ నుంచి రికవరీ చేసేలా మేనేజర్ కాగితాలు రాయించుకున్నారని తెలుస్తోంది.
కుదువపెట్టిన బంగారం మాయం చేసి నకిలీ బంగారం చూపుతున్నారని ఆరోపిస్తున్న బాధితురాలు గోల్డ్ అప్రైజర్ నకిలీ బంగారం తయారు చేయించి బ్యాంకులో జమ చేశారనే అనుమానాలు గోల్డ్ అప్రైజర్‌పై గతంలో దొంగనోట్ల కేసు ఉందని ఆరోపణలు 25 ఖాతాలకు సంబంధించి సుమారు రూ.40 లక్షల కుంభకోణం