కొనసాగుతున్న అక్రమ అరెస్టుల పర్వం | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అక్రమ అరెస్టుల పర్వం

Mar 18 2025 10:05 PM | Updated on Mar 18 2025 10:01 PM

పెడన: పెడనలో రెడ్‌ బుక్‌ ర్యాజ్యాంగం నడుస్తోంది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎందుకు కేసు పెడుతున్నారో? ఏం సెక్షన్లు పెడుతున్నారో? అసలు బయటకు చెప్పకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని తిరిగి ప్రశ్నించడమే నెపంగా పెడన పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ నాయకులు, కౌన్సిలర్‌ను ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ పెడన పోలీస్‌ స్టేషన్లోనే ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అసలు ఏం జరిగిందంటే..

ఆదివారం మధ్యాహ్నం దక్షిణ తెలుగుపాలెం(డీటీ పాలెం)కు చెందిన పాము నాగరాజు, తుమ్మ పైడియ్య ఓ కిళ్లీ షాపు వద్దకు వెళ్లారు. అదే సమయంలో టీడీపీ కార్యకర్త సులేమాన్‌దాదా అక్కడే ఉండి.. డీటీ పాలెంలో నూతన రామాలయం నిర్మాణానికి పాలెం వ్యక్తులు చందాలు వసూలు చేస్తున్న విషయంపై నోరు పారేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు వ్యక్తులు 19వ వార్డు కౌన్సిలర్‌ శిరివెళ్ల జయేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సులేమాన్‌దాదాను ప్రశ్నించడానికి ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో జయేష్‌ వెళ్లారు. సులేమాన్‌దాదా, కౌన్సిలర్‌ మధ్య ఈ విషయంపై మాటామాటా పెరిగి, తోసుకునే వరకు వెళ్లింది. ఈ లోగా సులేమాన్‌దాదా అనుచరులు పెద్ద ఎత్తున గుమికూడటమే కాకుండా దాడికి సిద్ధమయ్యారు. దీంతో జయేష్‌ అక్కడి నుంచి వచ్చేసి.. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు పెడన పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. దీనిని తెలుసుకున్న సులేమాన్‌దాదా తనకు గాయాలైనట్లుగా నటిస్తూ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఈలోపు పెడన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన కౌన్సిలర్‌ జయేష్‌తో పాటు పలువురు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్లోనే ఉంచేశారు.

హైడ్రామా నడుమ పెడన వైఎస్సార్‌ సీపీ నాయకులపై కేసులు విచారణ అంటూ తెల్లవార్లూ పోలీస్‌ స్టేషన్‌లోనే.. సీసీ ఫుటేజీలు పరిశీలన.. ఆధారాల్లేకున్నా అరెస్టులు

సోమవారం ఉదయం వచ్చిన మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్‌ రాజా కేసు విషయాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దాటవేశారు. పెడన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా ప్రాథమిక విచారణ పూర్తికాలేదని, అవ్వగానే పూర్తి సమాచారం ఇస్తామంటూ తప్పించుకున్నారు. కాగా కౌన్సిలర్‌ జయేష్‌తో పాటు 11మంది వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచినట్లు సమాచారం.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

ఈ లోగా సోషల్‌మీడియాలో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం చేసిన వైస్సార్‌సీపీ నాయకులు, జోగి రమేష్‌ అనుచరులంటూ ఆ పార్టీ శ్రేణులు వైరల్‌ చేశారు. సమాచారం అందుకున్న పెడన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రప్రసాద్‌, పెడన ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మచిలీపట్నం డీఎస్పీ సెలవులో ఉండటంతో గుడివాడ డీఎస్పీ, మచిలీపట్నం ఆర్‌పేట సీఐతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఎస్‌ఐలు పెడనకు చేరుకుని పరిస్థితిపై విచారణ చేపట్టారు. నవరంగ్‌ టీ స్టాల్‌లోని సీసీ కెమెరాతో పాటు పలు చోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పనిచేసిన చోట క్లారిటీ లోపించడంతో వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement