సీసీఎల్‌ఏ కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి జయలక్ష్మి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లోను అగ్రగామిగా నిలపాలని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్‌ఏ), జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆయా శాఖల ప్రగతిని జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రాధాన్యతా రంగాలు, కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి నెలా ముందస్తు టూర్ ప్రోగ్రామ్‌ను నిర్దేశించుకొని పర్యటిస్తే క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సమన్వయంతో పరిష్కరించవచ్చన్నారు. ప్రజలు అందజేస్తున్న అర్జీలకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలన్నారు. కమర్షియల్ ట్యాక్స్, ఎకై ్సజ్, మైన్స్, తదితర శాఖలు జిల్లా స్థాయిలోనే లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జాబ్ మేళా నిర్వహణ, ఉద్యోగ కల్పన తదితర లక్ష్యాలను పూర్తిచేశామన్నారు. సమావేశంలో వీఎంసీ కమిషనర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో శ్రీలత, ఆర్డీవోలు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.