నాగాయలంక: ప్రకృతి విపత్తులకు గురవుతున్న తీరప్రాంతమైన మండలంలో శాంతి భద్రతలు, ప్రజా సంరక్షణ సులభతరం కావడానికి నాగాయలంక పోలీస్‌స్టేషన్‌కు లిఖిత ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రై.లిమిటెడ్ అధినేత గడ్డపాటి శ్రీనివాసరావు రూ.13 లక్షల విలువైన వాహనం బహూకరించారు. తమ కంపెనీ సీఎస్‌ఆర్ నిధులతో ఈ వాహనాన్ని సమకూర్చారు. దాత శ్రీనివాసరావుకు ఎస్పీ గంగాధరరావు జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో దాత గడ్డిపాటి శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. వాహనానికి ఎస్పీ, దాత జెండా ఊపి నాగాయలంక పంపించారు. స్థానిక స్టేషన్‌కు ఆధునిక వాహనం అందజేసిన శ్రీనివాసరావును కలిదిండి ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది, గ్రామ ప్రముఖులు, ప్రజలు అభినందించారు.
18న జాబ్‌మేళా
గన్నవరం/చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 18వ తేదీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ సంస్థ ఆధ్వర్యాన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దేవరపల్లి విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరేష్‌కుమార్ శనివారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. దీనిలో బజాజ్ క్యాపిటల్, ఫ్లిప్‌కార్డ్, శ్రీరామసాయి ఆఫీస్ సొల్యూషన్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. టెన్త్, డిప్లమో, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన 18 నుంచి 30 ఏళ్లలోపు వారు జాబ్‌మేళాకు అర్హులని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఆసక్తికరమైన వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యాభివృద్ధి వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావడం, బయోడేటా ఫాంతో పాటు పాన్‌కార్డ్, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో మంగళవారం హాజరుకావాలని సూచించారు. ఇతర సమాచారానికి 94940 05725 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
సొరంగం లీకేజీలకు మరమ్మతులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): విజయవాడలోని చిట్టినగర్ సొరంగంలో లీకేజీలకు మరమ్మతులు చేపట్టారు. సొరంగంలో లీకవుతున్న నీటిధారలు వాహనచోదకులు, పాదచారులపై పడుతున్నాయి. దీనికోసం కొద్ది రోజుల క్రితం నీటిధారలు పడుతున్న ప్రాంతంలో గడ్డర్లు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం వాటి వద్ద మరమ్మతులు చేపట్టారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి సొరంగం మీదగా రాకపోకలను నిలిపివేశారు. కాలేజీలు, ట్యూషన్ల నుంచి వచ్చే వారు కబేళా, పాలప్రాజెక్టు మీదగా తిరిగి రావాల్సి వచ్చింది. పాదచారులు, సైకిల్‌పై వచ్చే వారిని మాత్రం సొరంగం లోపల నుంచి అనుమతించారు. కార్పొరేషన్ అధికారులు ముందస్తుగా ఎటువంటి సూచనలు లేకుండా రాకపోకలు నిలిపివేయడంపై వాహనచోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఉదయానికి మరమ్మతులు పూర్తవుతాయని కార్పొరేషన్ సిబ్బంది పేర్కొంటున్నారు.
సత్యదేవుని ఆలయాభివృద్ధికి రూ.లక్ష విరాళం
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో రెండో అన్నవరంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.1,01,116ను దాతలు వల్లభనేని పాండురంగారావు, కస్తూరి, వెంకట రామయ్య అందించారు. శనివారం ఈ విరాళాన్ని గుడ్లవల్లేరు ఎస్‌ఈఆర్‌ఎం విద్యాసంస్థల చైర్మన్ వల్లభనేని వెంకట్రావు, నెహ్రూ పశువుల సంత కమిటీ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బారావు, కార్యదర్శి ఈడ్పుగంటి ఉమాకు దాతలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కొప్పురావూరి రవి, మురాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పీఎస్‌కు వాహనం బహూకరణ