
బోల్తాపడ్డ బస్సు నుంచి వృద్ధులను బయటకు తీసుకొస్తున్న రైల్వే టీటీఐలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వారిద్దరూ విజయవాడ డివిజన్ ఒంగోలుకు చెందిన రైల్వే టీటీఐలు.. తెల్లవారుజామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు.. వారి ముందు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని బొల్తాపడింది. చుట్టూ చీకటి.. సమీపంలో ఏఒక్కరూ లేరు.. ఆయిల్ ట్యాంక్ లీక్ అయ్యి రోడ్డు అంతా చమురుతో నిండిపోయింది. బస్సులో నుంచి ప్రయాణికుల ఆర్తనాదాలు.. క్షణాల్లో స్పందించిన టీటీఐలు బస్సు అద్దాలు పగులకొట్టి లోపలికి వెళ్లి గాయపడ్డ వృద్ధులు, మహిళలు, పిల్లలను బయటకు తీసి తీవ్ర గాయాలతో ఉన్న వారిని 108 ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్య సేవలు అందటంతో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. సకాలంలో స్పందించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన రైల్వే టీటీఐలపై ప్రయాణికులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున టంగుటూరు వద్ద జరిగింది.
ఒంగోలు టీటీఈలుగా పనిచేస్తూ...
ఒంగోలులో టీటీఈలుగా విధులు నిర్వర్తిస్తున్న బీవీఎన్ తేజ, ఆర్.సుధీర్‌లు తమ విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వారి ముందు కడప నుంచి షిర్డీకి యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సూరారెడ్డిపాలెం వద్దకు రాగానే డ్రైవరు నిద్రమత్తులో డివైడర్‌ను ఢీకొట్టడంతో బస్సు బొల్తా పడింది. వెంటనే స్పందించిన రైల్వే టీటీఈలు బస్సు అద్దాలు పగులకొట్టి లోపలికి వెళ్లి గాయపడ్డ వృద్ధులు, పిల్లలు, మహిళలను కిటికి నుంచి బయటకు తరలించారు. 108కి సమాచారం అందించడంతో వారు క్షణాల్లో చేరుకుని, అక్కడకు చేరుకున్న సానికుల సాయంతో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయాలు తప్ప ఎటువంటి ప్రాణ నష్టం కలుగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి తమ వంతు బాధ్యతగా బాధితులను కాపాడి వారి ప్రాణాలను కాపాడిన రైల్వే టీటీలను ప్రయాణికులతో పాటు స్థానికులు ప్రసంశించారు. తమ కళ్లముందు జరిగిన ప్రమాదంపై సకాలంలో స్పందించి వారి ప్రానాలను కాపాడటంలో విశేషంగా కృషిచేసిన టీటీలను డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్, సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబులు ప్రత్యేకంగా అభినందించారు.
