తీరుమారని టీడీపీ... తహసీల్దార్‌ వనజాక్షిపై ఫిర్యాదు

- - Sakshi

‘ఈనాడు’సంస్థల యజమాని చెరుకూరి రామోజీరావుది పెదపారుపూడి. స్వగ్రామంలో తాగునీటి చెరువు ఆక్రమణ అంశం ఈనాడు దృష్టికి రాలేదా? లేక టీడీపీ వారి వ్యవహారం కాబట్టి పట్టించుకోవడం లేదా? అనే అభిప్రాయాలు గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతుండటం చర్చనీయాంశం.

సాక్షి, మచిలీపట్నం: ద్రోణవల్లి వనజాక్షి. కృష్ణా జిల్లాలో తహసీల్దార్‌. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముసునూరు ఎమ్మార్వోగా తమ్మిలేరులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చేతిలో అవమానానికి, ఆయన అనుయాయుల చేతిలో దాడికి గురైన అధికారి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేత చీవాట్లు తప్పని బాధితురాలు. ఇప్పటికీ తెలుగుదేశం ఆమెను వెంటాడుతూనే ఉంది. తాజా అంశం చెరువును ఆక్రమించి ఆలయ నిర్మాణం చేపట్టవద్దని గ్రామస్తులతో కలిసి టీడీపీ నేతలకు అభ్యంతరం చెప్పడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే.

నీటి వనరును ఆక్రమించి నిర్మాణ యత్నం..
కృష్ణా జిల్లా ఉంగుటూరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న వనజాక్షి మెట్టినిల్లు మండల కేంద్రమైన పెదపారుపూడి. రెండున్నర వేల మందికి పైగా రక్షితనీటి సరఫరాకు ఉద్దేశించిన తాగునీటి చెరువు ఉంది. ఇందులో ‘శ్రీశ్రీశ్రీ గంగాపార్వతీ దేవి సమేత జ్ఞానమహేశ్వరస్వామి వార్ల దేవస్థానం’ నిర్మాణానికి గారపాటి వీరనాగబాబు, వెనిగండ్ల వెంకట్రావు తదితర స్థానిక టీడీపీ నాయకులు ప్రణాళిక చేశారు. మహిళా సర్పంచ్‌ (రిజర్వుడు) అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పలువురు అనుకూలురు నుంచి సంతకాలు సేకరించిన టీడీపీ బృందం ఈనెల 19వ తేదీన భూమిపూజ ముహూర్తాన్ని ఖరారు చేసింది. దేవస్థాన భక్తబృందం పేరిట కరపత్రాలను ముద్రించి విరాళాల సేకరణ ముసుగులో వసూళ్లు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 203/1 సర్వే నంబర్లోని చిన్నచెరువుగా పిలుచుకునే సుమారు 70 సెంట్ల స్థలం ఆక్రమణల బారిన పడనుంది. సెంటు రూ. 5 లక్షల చొప్పున ఈ స్థలం విలువ రూ.3.50 కోట్లు పైమాటే.

తప్పు చేయవద్దన్నందుకు..
నీటివనరులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను వివరిస్తూ గ్రామస్తులతో కలిసి తహసీల్దార్‌ వనజాక్షి అభ్యంతరం చెప్పా రు. టీడీపీ నాయకులు పెడచెవిన పెట్టడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులకు వందేళ్లుగా ఉపయోగపడుతున్న తాగు నీటి చెరువును రక్షించాల ని కోరారు. దీంతో తహసీల్దార్‌పై టీడీపీ నాయకులు కక్షకట్టి గ్రామంలో తాటి చెట్లు కొట్టించి, మట్టి తోలించి రోడ్డు వేయించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

భూముల రీసర్వేతో..
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న రీ సర్వేతో పెదపారుపూడిలో దారులు, డొంకలు తదితర ప్రభుత్వ భూముల వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు ఆక్రమణలు తొలగాయి. ఆ క్రమంలోనే సుమారు ఏడు వందల మీటర్ల మేర డొంక ఆక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో వనజాక్షి కుటుంబంతో పాటు మరో పదిహేను మంది రైతులు సుమారు 150 ఎకరాల్లోకి రాకపోకలు సాగించేందుకు, తమ పంట ఉత్పత్తుల రవాణాకు వీలుగా స్వచ్ఛందంగా డొంకను బాగుచేసుకున్నారు. ఆ క్రమంలో అడ్డుగా ఉన్న తాటిచెట్లను తొలగించి, వాటిని వినియోగించుకుని సుమారు 15 అడుగుల మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకున్నారు. తమ పొలాల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు వీలుగా గ్రావెల్‌ రోడ్డు నిర్మింపజేయాలని ప్రభుత్వానికి రైతులు విన్నవించుకున్నారు కూడా.

ఎంతకీ మారరా?
గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలను అడ్డుకుని చంద్రబాబు ఆగ్రహానికి గురైన ఆనాటి ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై తాజాగా టీడీపీ పెద్దలు దురుద్ధేశపూర్వకంగానే ఫిర్యాదులు చేయించారని పెదపారుపూడి వాసులు అభిప్రాయపడుతున్నారు. నాడు ఇసుక అక్రమాలు వద్దన్నందుకు, నేడు తాగునీటి చెరువు ఆక్రమణ సరికాదన్నందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారే తప్ప ఆ పార్టీ నాయకుల తీరు మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన సూరపనేని వెంకటరమణబాబు, సురేంద్రబాబులు ఆర్‌ఎస్‌ నంబర్‌ 210లో పది సెంట్లు స్థలం దానమిచ్చారని, అందులో నిర్మాణం చేపట్టవచ్చని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం ముసుగులో చెరువు ఆక్రమణలకు గురికాకుండా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top