రవికల పేరుతో నిలువు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

రవికల పేరుతో నిలువు దోపిడీ

Aug 27 2023 1:50 AM | Updated on Aug 28 2023 5:07 PM

- - Sakshi

ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు అమ్మవారికి చీరలు సమర్పిస్తే మరి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు అమ్మవారికి చీరలు సమర్పిస్తే మరి కొందరు రవికలు సమర్పిస్తుంటారు. భక్తులు తమకు కావాల్సిన చీరలు, రవికలను ఆలయ పరిసరాల్లోని దుకాణాల నుంచి కొనుగోలు చేస్తారు.

అయితే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్‌, మహా మండపం 5వ అంతస్తులోని దుకాణాల్లో రవికల పేరిట గుడ్డ పీలికలను అందమైన ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి శనివారం విచ్చేసిన ఎం. హారిక దంపతులు అమ్మవారికి రవికను సమర్పించేందుకు మహా మండపం ఐదో అంతస్తులోని షాపునకు వెళ్లి రూ. వంద చెల్లించి రవికను కొనుగోలు చేశారు.

రూ. 10 చెల్లించి పసుపు, కుంకుమ ప్యాకెట్‌ను కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కౌంటర్‌లో ఆ రవికను ఇచ్చారు. అయితే దేవస్థాన కౌంటర్‌లోని సిబ్బంది అది చెత్తలో వేయాలని సూచించారు. దీంతో షాక్‌కు గురైన వారు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. తమకు విక్రయించినది రవిక ముక్క కాదని, కనీసం ఖర్చీపు కూడా కాదని తెలుసుకున్నారు. అడిగినంత ఇస్తున్నా.. ఆలయ ప్రాంగణంలోనే ఇలా భక్తులను మోసం చేయడం ఎంత వరకు సబబని కౌంటర్‌లో సిబ్బందిని నిలదీశారు. దీనిపై మీరు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు.

దీంతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఇదంతా సాధారణమని ఆ అధికారి సలహా ఇవ్వడంతో వారు ఆలయ ఈవో భ్రమరాంబను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈవో అందుబాటులో లేరని తెలుసుకుని వెను తిరిగారు. ప్రతి నిత్యం ఇలా వందలాది మంది భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆలయ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement