గైర్హాజర్‌పై ఫోకస్‌! | - | Sakshi
Sakshi News home page

గైర్హాజర్‌పై ఫోకస్‌!

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

పాఠశాలల్లో వందశాతం హాజరు నమోదు లక్ష్యం ఈ నెల 23న పూర్తిస్థాయిలో విద్యార్థులు బడికి రావాల్సిందే.. అబ్సెంట్‌ అయిన పిల్లల తల్లిదండ్రులతో కలెక్టర్‌ సమీక్ష

కెరమెరి: విద్యార్థుల గైర్హాజరుపై కలెక్టర్‌ కె.హరిత ప్రత్యేక దృష్టి సారించారు. బతుకమ్మ, దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన తొలిరోజే విద్యార్థులందరూ బడిబాట పట్టాలని, వందశాతం హాజరు నమోదు కావాలని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. అంతేకాక ప్రతీ మండలం నుంచి అత్యధికంగా గైర్హాజరయ్యే టాప్‌– 10 మంది విద్యార్థుల తల్లిదండ్రులను నేరుగా కలెక్టరేట్‌కు పిలిపించనున్నారు. ఈ మేరకు గైర్హాజరుకు కారణాలపై సమీక్షించనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఇటీవల సర్క్యులర్‌ జారీ చేశారు. జిల్లాలో కేజీబీవీలతో కలిపి 736 ప్రభుత్వ పాఠశాలల్లో 41,218 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలోని ఎఫ్‌ఆర్‌ఎస్‌ కొనసాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెలలో 80 శాతానికి పైగా హాజరు పెరిగింది. దీంతో సంతృప్తి చెందకుండా మిగిలిన వ్యత్యాసాన్ని అధిగమించి వందశాతం హాజరు సాధించడమే లక్ష్యంగా అధికారులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే హెచ్‌ఎంలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థులు ఎందరు, దీర్ఘకాలిక ఆబ్సెంట్‌ ఉన్న విద్యార్థులు ఎందరు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలదే బాధ్యత

బడీడు పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా చూడడంలో పంచాయతీ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు కీలక పాత్ర పోషించనున్నారు. సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ కమిటీ, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) ప్రతిని ధులు గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలి. తమ ఊరిలో ఒక్కరు కూడా చదువుకు దూరం కాకుండా బడికి పంపించే బాధ్యతను ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

పోషకులు, సర్పంచులతో కలెక్టర్‌ సమీక్ష

పాఠశాలలు తెరిచిన తొలిరోజు గైర్హాజరైన వారిని గుర్తించి కారణాలను వెంటనే తెలుసుకుని వారిని తిరిగి పాఠశాలకు తీసుకురావాల్సి ఉంది. అలాగే ప్రతీ మండలం నుంచి అత్యధికంగా గైర్హాజరయ్యే టాప్‌–10 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, వారి ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సర్పంచులు, స్వయం సహాయక సంఘాల లీడర్లతో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ స్వయంగా ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. విద్యార్థి ఎన్ని రోజులు హాజరుకాలేదు.. ఎందుకు కాలేదు... సమస్య ఏంటి అనే విషయాలను కలెక్టర్‌ నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఆసమస్యను అధిగమించేందుకు తీసుకునే చర్యల గురించి వివరించనున్నారు. రోజు వారీ హాజరులో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని జిల్లా అధికారులు, మండలాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో పాఠశాలల వివరాలు

సెలవుల్లోనే తల్లిదండ్రులకు ఫోన్లు

ఈ నెల 23న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ప్రతీ విద్యార్థి తరగతి గదిలో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. త రచూ పాఠశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి స్వయంగా లేదా సెలవుల్లోనే తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ‘అక్టోబర్‌ 23న బడులు ప్రారంభమవుతున్నాయని, ఆ రోజే తప్పకుండా మీ పిల్లవాడిని/ పాపను బడికి పంపాలి..’ అంటూ ఇప్పటికే కొన్నిపాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఇంకొంద రు తరగతుల వారీగా హాజరు జాబితాలను సిద్ధం చేసుకుని నిశితంగా పరిశీలిస్తున్నారు.

23న ప్రతీ విద్యార్థి హాజరు కావాలి

ఈ నెల 23న జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వందశాతం విద్యార్థులు హాజరయ్యేలా చూడాలి. ప్రధానోపాధ్యాయులు ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలి. తరచూ గైర్హాజరవుతున్న పది మంది విద్యార్థుల తల్లిదండ్రులు, హెచ్‌ఎంలను కలెక్టర్‌ పిలిపించుకుని మాట్లాడతారు. హెచ్‌ఎంలు తొలిరోజు ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా చూడాలి.

– సచ్చిదానందచారి, జిల్లా విద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement