విద్యుత్ కోతలపై ఆరా!
బెజ్జూర్: విద్యుత్ కోతలు, కాలువలు సక్రమంగా లేకపోవడంతో వరి సాగు చేసిన రైతులు పడుతున్న ఇబ్బందులపై సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమై న ‘పగలూరాత్రి పొలం కాడ్నే’ అనే కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. విద్యుత్ సరఫరా క్షేత్ర స్థాయి పరిస్థితుల నివేదిక పంపించాలని బెజ్జూర్ విద్యుత్ అధికారిని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని, వారం రోజుల క్రితం వీధి దీపాల ఏర్పాటుతో అంతరాయం ఏర్పడిందని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఇప్పటికైనా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
భారీగా దరఖాస్తులు
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రారంభించనున్న 2బీ బార్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. సోమవారం గడువు ముగియగా 205 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి రమావత్ లక్ష్మానాయక్ తెలిపారు. ఆదివారం వరకు కేవలం 50 దరఖాస్తులు రాగా, సోమవారం ఒక్కరోజే 155 దరఖాస్తులు వచ్చాయి. బ్యాంకు, కార్యాలయం వద్ద టెండర్‌దారులతో సందడి నెలకొంది. ఈ నెల 16న కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.హరిత ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.
హక్కుల సాధనకు ఐక్య పోరాటం
తిర్యాణి: కొలాంలు హక్కుల సాధనకు ఐక్య పోరాటం సాగించాలని కొలాం సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి పిలుపునిచ్చారు. మండలంలోని చెలిమల పంచాయతీ పరిధిలోని బుగ్గ గ్రామంలో సోమవారం సంఘ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్నిరంగాల్లో అత్యంత వెనుకబాటుకు గురైన కొలాం ప్రజల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల అధ్యక్షుడిగా ఆత్రం బొజ్జిరావు, ప్రధాన కార్యదర్శిగా భీంరావు, కోశాధికారిగా అనంత్‌రావు, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సమావేశంలో పీవీటీజీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీంరావు, కొలాం సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు సిడాం అన్నిగా, జిల్లా ఉపాధ్యక్షుడు బొజ్జిరావు, టేకం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


