పరిశీలించి.. పరిష్కారానికి ఆదేశించి | - | Sakshi
Sakshi News home page

పరిశీలించి.. పరిష్కారానికి ఆదేశించి

Oct 13 2026 12:05 AM | Updated on Oct 13 2026 12:05 AM

● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణ ● అధికారుల గైర్హాజరుపై కలెక్టర్‌ ఆగ్రహం

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కె.హరిత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్లు యువరాజ్‌ మర్మాట్‌, డేవిడ్‌, డీఆర్‌వో దాసరి వేణుతో కలిసి అర్జీలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం దరఖాస్తులు పెండింగ్‌ ఉంచకుండా వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా బూర్గుడ గ్రామంలోని కళాశాలలో బీఈడీ పూర్తి చేసిన తనకు టీసీ ఇప్పించాలని చింతలమానెపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన మచిందర్‌ విన్నవించాడు. పీఎం స్వయం ఉపాధి పథకం కింద డెయిరీ ఫాం నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, పంచాయతీ నుంచి ఎన్‌వోసీ ఇప్పించాలని వాంకిడి మండలం తేజాపూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌ కోరాడు. దివ్యాంగ పింఛన్‌ ఇప్పించాలని కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన అల్లూరి చైతన్య దరఖాస్తు చేసుకున్నాడు. తన భూమిని ఆక్రమించి కొందరు పట్టా చేసుకున్నారని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని సిర్పూర్‌(టి) మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన తిరుపతి కోరాడు.

30 మందికి షోకాజ్‌ నోటీసులు జారీ..

ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన 30 మంది జిల్లా అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణికి ప్రతీ ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సరైన సమాచారం లేకుండా గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement