ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

● జిల్లాలో 40 కొనుగోలు కేంద్రాలు ● నెలాఖరులో ప్రారంభించే అవకాశం ● ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ● లక్ష్యం.. 23,900 మెట్రిక్‌ టన్నులు

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన వర్షాకాలానికి సంబంధించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ సీజన్‌లో జిల్లాలో 47వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, అధికారులు 23,900 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. కేంద్రాల ప్రారంభానికి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పలుసార్లు సంబంధిత అధికారులతో ఇదివరకే సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఈ నెలాఖరులోపు వరి కోతలు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సహకార సంఘాల ఆధ్వర్యంలో 21, ఐకేపీ ఆధ్వర్యంలో 19 కేంద్రాలు ప్రారంభించనున్నారు. మొదటి రకం క్వింటాల్‌ ధాన్యానికి రూ.2,461, రెండో రకం ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించనున్నారు.

రైతులకు సమస్యలు తలెత్తకుండా..

వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కనీస వసతులు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. తాగునీరు, నీడ కోసం టెంట్లు వేయనున్నారు. ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచనున్నారు. 17శాతం లోపు తేమ ఉండేలా తాలు, దుమ్ము లేకుండా కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లలో ఎంట్రీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం ట్యాగింగ్‌ చేయబడిన రైస్‌ మిల్లులకు తరలిస్తారు. ఈమేరకు అవసరాలకు అనుగుణంగా లారీలు, హమాలీలను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.

అవగాహన కల్పిస్తున్న అధికారులు

రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తేమ శాతం నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా వ్యవసాయశాఖ అధికా రులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనెలాఖరు వరకు కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశంలో ఏర్పాటు చేసి దొడ్డు రకం, సన్నరకం ధాన్యాన్ని వేర్వేరుగా సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, ట్యాబ్‌లను అందుబాటులో ఉంచి రైతుల నుంచి క్రమపద్ధతిలో ధాన్యం కొ నుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు చేస్తాం

రైతులు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. తూకం యంత్రాలు, తేమ కొలిచే మీటర్లు, టార్పాలిన్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించాం. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతున్నాం.

– కె.హరిత, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement