శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల కు ఏటా దీపావళికి అందిస్తున్న పీఎల్‌ఆర్ బోనస్ రూ.1,10,250 కు చేరుకుంది. 1962లో రూ.300తో మొదలైన బోనస్ 2026లో రూ.1,10,250కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా బొగ్గు గని కార్మికులకు ప్రతి సంవత్సరం చెల్లించే ప్రాఫిట్ లింక్డ్ రివార్డు (పీఎల్‌ఆర్)కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1962లో ఈ హక్కు మొదలైంది. సింగరేణిలో పుట్టిన ఈ హక్కు చివరికి కోలిండియా వ్యాప్తంగా అమలవుతోంది. శనివారం కోల్‌కత్తాలో జరిగిన జేబీసీసీఐ అపెక్స్ కమిటీ స మావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎల్‌ఆర్ బోనస్ రూ.1,10,250 చెల్లించడానికి నిర్ణ యం జరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో విస్తరించిన కోలిండియా పరిధిలోని 8 సబ్సిడరీ కంపెనీలతో పాటు సింగరేణి కార్మికులకు కూడా ఈ బోనస్ చెల్లిస్తారు. దీంతో దేశ వ్యాప్తంగా సుమారు 2.25 లక్షల మంది కార్మికులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. కమ్యూనిస్టు నాయకుడు, నాటి ఖమ్మం ఎంపీ, దివంగత టీబీ విఠల్‌రావు రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ బొగ్గు సంస్థల్లో లాభాల ఆధారంగా బోనస్ చెల్లిస్తున్న విషయం తెలుసుకున్నారు. సింగరేణిలో కూడా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మరో కమ్యూనిస్టు నాయకుడు కొమురయ్యతో కలిసి సమ్మె చేశారు. సమ్మెతో దిగి వచ్చిన సింగరేణి యాజమాన్యం కార్మికులకు ఈ హక్కును కల్పించింది. మొదటగా రూ.3 వేలు చెల్లించారు. ఆ తర్వాత కోలిండియాలో కూడా దీనిపై డిమాండ్ పెరగడంతో 1965లో ఈ బోనస్ చెల్లింపుపై పార్లమెంట్‌లో చట్టం చేయడంతో అప్పటి నుంచి బొగ్గుగనుల్లో అమలవుతోంది.
దీపావళి బోనస్‌గా పేరు..
పశ్చిమ బెంగాల్‌లో కోలిండియా ప్రధాన కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ దసరాను పెద్ద పండుగగా జరుపుకొంటారు. దసరాకు ముందు జాతీయ సంఘాలతో కోలిండియా యాజమాన్యం చర్చలు జరిపి దీనిపై నిర్ణయానికి వస్తారు. ఈ బోనస్‌ను కోలిండియాలో దసరాకు ముందు చెల్లిస్తే సింగరేణిలో దీన్ని దీపావళికి ముందు చెల్లిస్తారు. దీంతో సింగరేణిలో దీన్ని దీపావళి బోనస్ అని కూడా పిలు స్తారు. సింగరేణిలో ఎప్పుడు చెల్లించేది కొద్దిరోజుల తర్వాత కంపెనీ ప్రకటిస్తుంది. ఈసారి రూ.1.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయగా చివరికి రూ.1,10,250కు ఒప్పందం జరిగింది.
కొన్నేళ్లుగా పీఎల్‌ఆర్ బోనస్ చెల్లింపులు ఇలా..
సంవత్సరం చెల్లింపు (రూ.ల్లో)
1962 300
2007 6000
2008 8350
2009 10,000
2010 15,000
2011 21,000
2012 26,500
2013 31,500
2014 40,000
2015 48,500
2016 54,000
2017 57,000
2018 60,500
2019 64,500
2020 68,500
2021 72,500
2022 76,500
2023 85,500
2024 93,750
2025 1,03,000
2026 1,10,250


