ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ముందడుగు
150మీటర్ల ఎత్తు బరాజ్, వంద టీఎంసీల నీటి వినియోగం
నాటి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధం
7న తుమ్మిడిహెట్టికి సీఎం రేవంత్‌రెడ్డి రాక
పరిశీలించిన కలెక్టర్, అధికారులు
కౌటాల: ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత, ఎస్పీ పి.నితిక పంత్, ఎమ్మెల్సీ దండె విఠల్ శుక్రవారం కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాణహిత నది ప్రాంతాన్ని పరిశీలించారు. బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీరు తదితర వివరాలపై ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు, నీటి పారుదల శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు తుమ్మిడిహెట్టిలోని ప్రాణహిత నది బరాజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తారని తెలిపారు. సీఎం, మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ స్థలం, సభా ప్రాంగణం ప రిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. 150మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణం, వంద టీఎంసీల నీటి వినియోగానికి ఇటీవల రాష్ట్ర సాగునీటి శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మహారాష్ట్రలో ముంపు ఏర్పడితే పరిహారం చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల ఏళ్లనాటి సాగునీటి కల సాకారం వైపు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బరాజ్ నిర్మించే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి శివారు ప్రాణహిత నది వద్దకు రానున్నారు.
18ఏళ్లుగా ఎదురుచూపులు..
ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించేందుకు జలయజ్ఞంలో భాగంగా 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తుమ్మిడిహెట్టి వద్ద శంకుస్థాపన చేశారు. 152 అడుగుల ఎత్తులో బరాజ్ నిర్మించి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలకు నీరందించాలి. ఆ తర్వాత ఎల్లంపల్లి వరకు నీటిని తరలించి అక్కడి నుంచి ఆరు జిల్లాలకు నీరివ్వాలి. ఇందుకోసం భూసేకరణ, 71కిలోమీటర్ల కాలువల నిర్మాణానికి రూ.11వేల కోట్లు వెచ్చించారు. అయితే 152మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 30 గ్రామాల ముంపు ఏర్పడుతుందని అభ్యంతరాలు రావడంతో ఆగిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. చివరగా 2015లో నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో జరిగిన చర్చల్లో 148మీటర్ల ఎత్తు వరకు అంగీకరించారు. పూర్తి స్థాయి ఎత్తుకు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టును పూర్తిగా పక్కనపెట్టారు. రీడిజైన్‌లో గోదావరి–ప్రాణహిత కలిసే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. తర్వాత వార్దా నదిపై బరాజ్ కట్టి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల సాగునీటికి డిజైన్లు చేసినా ముందుకు సాగలేదు.
2008లో నాటి కాంగ్రెస్ సర్కారు హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తుమ్మిడిహెట్టి ప్రాంతాన్ని ప్రారంభ సమయంలో సందర్శించారు. మళ్లీ 18ఏళ్ల తర్వాత ఓ ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నారు. ఈ నెల 7న ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంతో పోలిస్తే బరాజ్ నిర్మాణం, కాలువలు, భూ సేకరణ ఇతర వ్యయం ఎల్లంపల్లి వరకే భారీగా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బరాజ్ ఎత్తు విషయంలో స్పష్టత వచ్చినప్పటికీ ఇంకా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాలేదు. గోదావరిపై ఉన్న సుందిళ్ల బరాజ్‌కు తరలించడమా, లేక పాత డిజైన్ ప్రకారమే ముందుకు వెళ్తారా? అనేది తుది ప్రతిపాదన వెల్లడి కావాల్సి ఉంది. దీంతో పెరిగిన ఖర్చులతో రూ.20వేల కోట్ల వరకు అవుతుందనే అంచనా ఉంది.
భారీగా పెరగనున్న వ్యయం


