దహెగాం: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని సివిల్ సప్లై డీఎం రజిత అన్నారు. మండలంలోని లగ్గాంలో సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. డీఎం మాట్లాడుతూ కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని సూచించారు. తేమ 17 శాతం కంటే మించకుండా ఉండాలని, తాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా రైతులు ఇబ్బంది పడకుండా టెంట్లు, షెడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. అకాల వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడానికి టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోండ్ర మహేశ్‌గౌడ్, డీసీఏవో శ్యాముల్, ఏవో రామక్రిష్ణ, డీటీ గణేశ్, సీఈవో బక్కయ్య, ఏఈవోలు ఆదిత్య, ఆనంద్ పాల్గొన్నారు.


