సీజన్‌కు ముందే దందా..! | - | Sakshi
Sakshi News home page

సీజన్‌కు ముందే దందా..!

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

జిల్లాలో విచ్చలవిడిగా నకిలీ పత్తి విత్తనాలు ఇటీవల రెండుచోట్ల భారీగా పట్టుకున్న పోలీసులు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

రెబ్బెన మండలం కొమురవెళ్లికి చెందిన గజ్జల సూర్యకాంత్‌, అతని స్నేహితులైన జక్కులపెల్లికి చెందిన ధోని రాజేశ్‌, కొమురవెళ్లికి చెందిన కొల్లూరి సాయికిరణ్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీనివాస్‌ వద్ద నకిలీ పత్తి విత్తనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి స్థానిక రైతులకు అంటకట్టే ప్రయత్నం చేశారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు సూర్యకాంత్‌ వద్ద నుంచి 175 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.37 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. ఏప్రిల్‌ 28న పోలీసులు ఈ ఘటన వివరాలు వెల్లడించారు.

సిఫాబాద్‌ పట్టణ సమీపంలో ఏప్రిల్‌ 15న పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన వ్యాపారి రాచర్ల మహేశ్‌, సాయికిరణ్‌ కారులో తరలిస్తున్న 80కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. విచారణ అనంతరం పోలీసులు వ్యాపారి మహేశ్‌ ఇంటి వద్ద మరో 5.70 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ.27లక్షల ఉంటుందని, గుజరాత్‌ నుంచి తెచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

చింతలమానెపల్లి: వానాకాలం సీజన్‌ ప్రారంభానికి ముందే నకిలీ విత్తనాల దందా ప్రారంభమైంది. ‘అధిక దిగుబడి, తక్కువ ఖర్చు’ అని మాయమాటలు చెబుతూ కొందరు రైతులకు అంటకట్టేందుకు క్వింటాళ్ల కొద్దీ దిగుమతి చేసుకుని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పత్తి అధికంగా సాగు చేస్తుండగా నకిలీ విత్తనాలతో లాభాలు పొందేందుకు వ్యాపారులు అక్రమ దందాకు తెరతీస్తున్నారు. గతేడాది మంచిర్యాల, బెల్లంపల్లి తదితర పట్టణాల నుంచి కాగజ్‌నగర్‌, వాంకిడి, సిర్పూర్‌(టి) ప్రాంతాలకు సరఫరా చేసి విక్రయించారు.

వివిధ ప్రాంతాల నుంచి సరఫరా..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాలు, మహారాష్ట్రలోని ఇందన్‌ఘాట్‌, నాగపూర్‌, గుజరాత్‌లో వడోదర, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి నకలీ విత్తనాలు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో దందా ఏటా కొనసాగుతోంది. విత్తనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించినప్పుడు నివేదిక రావడానికి సుమారు ఆరు నెలలకు పైగా సమయం పడుతోంది. అలాగే ప్రధాన వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో వీరిని పట్టుకోవడం పోలీసుశాఖ, వ్యవసాయ శాఖలకు కష్టతరంగా మారుతోంది. గతేడాది కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో స్థానిక వ్యాపారులకు నకిలీ విత్తనాలు సరఫరా చేసిన సురేశ్‌ అనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారిపై మాత్రం పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయగలిగారు.

అనర్థాలే ఎక్కువ..

నకిలీ విత్తనాలకు జెనటిక్‌ ఇంజినీరింగ్‌ కమిటీ అనుమతులు ఉండవు. అధిక దిగుబడి వస్తుందనుకున్నా కలిగే అనర్థాలే ఎక్కువ. భూసారం తీవ్రస్థాయిలో తగ్గుతుంది. జన్యు సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. రైతులకు ఎలాంటి రశీదులు ఇవ్వకపోవడంతో పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి కనీసం పరిహారం అందదు. దీంతో విత్తనాల క్రయ, విక్రయాల నివారణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలను రూపొందించాయి. పూర్తిస్థాయి అనుమతులు లేకుండా విక్రయిస్తే విత్తన చట్టం– 1966, పర్యావరణ పరిరక్షణ చట్టం– 1986 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. నాణ్యత లేని విత్తనాలను ఇతర ప్రముఖ బ్రాండ్ల పేరుతో అమ్మితే ఆయా కంపెనీలు ఇచ్చే ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తారు.

రైతులకు తీవ్ర నష్టం

నకిలీ విత్తనాల వినియోగంతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. సరైన సమయంలో విత్తనాలు విత్తి దుక్కి దున్నితే కలుపు నివారించుకోవచ్చు. గడ్డి నివారణకు పర్యావరణ హితమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఆమోదించిన మందులు వినియోగించాలి. నకిలీ విత్తనాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.

– వెంకట్‌, జిల్లా వ్యవసాయ అధికారి

నిఘా పెడితేనే కట్టడి

నకిలీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఇటీవల సమావేశం నిర్వహించారు. చింతలమానెపల్లి మండలం గూడెం, సిర్పూర్‌(టి) మండల కేంద్రం, వెంకట్రావుపేట, వాంకిడి మండలంలోని జాతీయ రహదారిపై మహారాష్ట్రకు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఏఈవోలను తనిఖీ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్‌ మరిత, జిల్లా వ్యవసాయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ విత్తనాల గుర్తింపు, నష్టాల గురించి వారికి వివరిస్తే కట్టడి సాధ్యమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement