కార్మికుల సంక్షేమానికి పథకాలు | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమానికి పథకాలు

May 2 2026 8:08 AM | Updated on May 2 2026 8:08 AM

● ఈ– శ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి ● ఆర్డీవో లోకేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌: కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో లోకేశ్వర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం మేడే వేడుకలు నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు ఈ– శ్రమ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి సమగ్రంగా వివరించారు. బాల వ్యవస్థ నిర్మూలనకు అంకితభావంతో పనిచేస్తున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్‌కు ఉత్తమ అధికారిగా, స్పెషల్‌ కేటగిరీ కింద చైల్డ్‌ లేబర్‌గా గుర్తించి ప్రస్తుతం చదువుకుంటున్న బాలుడు సన్నీకి ప్రోత్సాహక అవార్డు, ఉత్తమ యాజమాన్యం కింద సమర్థవంతమైన నిర్వహణకు జిన్నింగ్‌ మిల్లు యజమాని రఫీక్‌ జివానికి అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో ఏపీడీ రామకృష్ణ, మిషన్‌ భగీరథ ఈఈ సిద్దిఖి, డీఎంహెచ్‌వో సీతారాం, కార్మికశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్‌, విజయ్‌కన్నా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement