ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు గతేడాదితో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రస్థాయిలో గతేడాది జిల్లా 32వ స్థానంలో నిలవగా, బుధవారం వెలువడిన ఫలితాల్లో 28వ స్థానంలో నిలిచింది. ఫలితాల్లో మరోసారి బాలికలే బాలురపై పైచేయి సాధించారు. అంతే కాక పలు ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతతో సత్తా చాటాయి. 2025– 26 విద్యా సంవత్సరంలో ఇన్‌చార్జి డీఈవోగా అదనపు కలెక్టర్ దీపక్ తివారికి బాధ్యతలు అప్పగించడం కలిసి వచ్చింది. ఆయన పర్యవేక్షణలో విద్యాశాఖ గాడినపడింది. నిత్యం పాఠశాలలను తనిఖీ చేయడం, ఫలితాలపై దృష్టి సారించడం, ఎంఈవోలు, ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇవ్వడంతో మెరుగైన ఫలితాలు మెరుగయ్యాయి.
6,527 మంది పాస్
జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలలు ఉండగా 6,932 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,527 మంది ఉత్తీర్ణత సాధించారు. 3,213 బాలురు పరీక్షలు రాయగా 2,949 మంది (91.78 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 3,719 బాలికలకు 3,578 మంది(96.21) పా సయ్యారు. ఈసారి రాష్ట్ర విద్యాశాఖ సీబీఎస్ తరహాలో విద్యార్థులకు ప్రతీ పరీక్షకు మధ్య 3 నుంచి 5 రోజులు గడువు ఇచ్చింది. విద్యార్థులు చదువుకునేందుకు సమయం దొరికింది. విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ స్నాక్ అందించి నెల రోజులపాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దీంతో గత సంవత్సరంతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 87 నుంచి 94.16 శాతానికి పెరిగింది.
54 స్కూళ్లలో వందశాతం ఫలితాలు
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలల్లో 54 పాఠశాలు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఇందులో ప్రభు త్వ పాఠశాలలు ఎనిమి ది ఉండగా, 13 ఆశ్రమాలు, ఏడు కేజీబీవీలతోపాటు 18 ప్రైవేట్ స్కూళ్లలో కూడా పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ పాసయ్యారు.
జిల్లా కేంద్రంలో ఇలా..
సాత్విక(562)
కీర్తన(561)
క్రిషిత(556)
దివ్య(549)
సానియా(555)
హారిక(525)
సూర్యతేజ(532)
సాహిల్(538)
రిషిత(547)
సీతారాం(540)
కెరమెరి మండలం టాప్..
కెరమెరి: పదో తరగతి ఫలితాల్లో 99.11 ఉత్తీ ర్ణతతో కెరమెరి మండలం మొదటి స్థానంలో నిలవగా, తిర్యాణి 98.46 శాతం, సిర్పూర్(యు) 97.35, లింగాపూర్ 96.72, పెంచికల్‌పేట్ 96.25 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 85.82శాతంతో చింతలమానెపల్లి మండలం చివరి స్థానానికి పరిమితమైంది. కాగజ్‌నగర్(సిర్పూర్–టి) టీజీటీడబ్ల్యూఆర్‌జేసీకి చెందిన అక్షయ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. కాగజ్‌నగర్ క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన వై.వైష్ణవి 557 మార్కులతో రెండో స్థానం, కాగజ్‌నగర్‌లోని కేరళ హైస్కూల్ విద్యార్థి ఎస్.సంతోష్(576) మార్కులతో మూడో స్థానంలో నిలిచాడు. అధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల కృషితోనే మెరుగైన ఫలితాలు సాధించామని ప్రభుత్వ పరీక్షల సహాయాధికారి జనార్దన్‌గౌడ్ వెల్లడించారు.


