తుక్కు.. ప్రమాదాల ముప్పు | - | Sakshi
Sakshi News home page

తుక్కు.. ప్రమాదాల ముప్పు

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

అనుమతులు లేకుండానే స్క్రాప్‌ దుకాణాల నిర్వహణ

కనీస నిబంధనలు పాటించని వైనం

వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం

ప్రజల ప్రాణాలతో చెలగాటం

కాగజ్‌నగర్‌టౌన్‌: జిల్లాలో స్క్రాప్‌ దుకాణాల నిర్వాహకులు మున్సిపల్‌, పోలీస్‌, ఫైర్‌, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజల భద్రతతో చెలగాటం ఆడుతూ ఇష్టారాజ్యంగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల, దహెగాం మండల కేంద్రాల్లో 30 వరకు స్క్రాప్‌ దుకాణాలు ఉండగా, ఇందులో 90 శాతం దుకాణాలకు ట్రేడ్‌ లైసెన్స్‌ లేదు. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అనుమతి, పోలీస్‌ వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌.. ఇలా ఏదీ తీసుకోకుండా నివాస ప్రాంతాల మధ్య, పాఠశాలల పక్కన షాపులు నడుపుతున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి రిజిస్టర్లు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు.

నిబంధనలపై పట్టింపేది..?

పట్టణాల్లో తుక్కు దుకాణాలు నిర్వహించేవారు మున్సిపాలిటీ నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. నివాస ప్రాంతాలకు 100 మీటర్ల దూరంలోనే వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ఫైర్‌ ఎక్స్‌టింగ్విషన్లు ఇసుక బకెట్లు, నీటి ట్యాంక్‌ తప్పనిసరిగా ఉండాలి. ఎవరి నుంచి ఏం కొన్నారో విధిగా నమోదు చేయాలి. రోడ్డుపై సామాన్లు వేయకుండా కంపౌండ్‌ లోపలే నిల్వ చేయాలి. కానీ కాగజ్‌నగర్‌ పట్టణంలో స్క్రాప్‌ దుకాణాల నిర్వాహకులు రోడ్డు మొత్తం ఇనుప రేకులు, టైర్లు, ప్లాస్టిక్‌ డబ్బాలతో నింపుతున్నారు. రాత్రిపూట లైటింగ్‌ కూడా ఉండదు. పోలీసుల తనిఖీలు లేకపోవడంతో దొంగతనం చేసిన బైక్‌లు, మంచినీటి పైపులు కేబుల్‌ వైర్లు, రైల్వే ఇనుము, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇనుప బోర్డులు, రాగి, కేబుల్‌ వైర్లు ఇక్కడ అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వచ్చి సామాన్లు అమ్ముతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

అగ్ని ప్రమాదాలకు ఆస్కారం

వేసవి కావడంతో పెట్రోల్‌ డబ్బాలు, ప్లాస్టిక్‌ థర్మాకోల్‌, కేబుళ్లు, వ్యర్థాలు చిన్న నిప్పు రవ్వకే మంటలు చెలరేగి భారీ ప్రమాదాలకు ముప్పు పొంచి ఉంది. దుకాణాలకు దగ్గరగా చుట్టూ ఇళ్లు ఉండటతో భారీ నష్టం తప్పదు. అయినా ఒక్క దుకాణంలో కూడా ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్‌ లేదు. నిబంధనలు పాటించని స్క్రాప్‌ దుకాణాలపై ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

నిబంధనలు పాటించని స్క్రాప్‌ దుకాణాలపై చర్యలు తీసుకుంటాం. యజమానులు ప్రజ లకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. కాగజ్‌నగర్‌ పట్టణంలోని స్క్రాప్‌ దుకాణా లను తనిఖీ చేస్తాం. యజమానులు ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలి. – తిరుపతి,

మున్సిపల్‌ కమిషనర్‌, కాగజ్‌నగర్‌

ఈ ఫొటోలో కనిపిస్తున్న స్క్రాప్‌ దుకాణం కాగజ్‌నగర్‌ పట్టణంలోనిది. రోడ్డుకు పక్కనే ప్లాస్టిక్‌ వ్యర్థాలు వేయడంతో ఆ దారి గుండా వెళ్లేవారు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఈ దుకాణం పక్కనే ఆశ్రమ ఉన్నత పాఠశాల, బీసీ బాలుర వసతి గృహం, ఎస్సీ బాలుర వసతి గృహం, ఓ ప్రైవేటు పాఠశాలకూడా ఉన్నాయి. వ్యర్థాలను కాల్చినప్పుడు పొగ పాఠశాలల్లోకి వెళ్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement