ఆసిఫాబాద్: మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి జిల్లా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు చేసే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేయాలన్నారు. విద్యాసంస్థల సమీపంలోని టేలాలు, పాన్‌షాపులు, కిరాణ దుకాణాలపై నిఘా పెట్టాలని సూచించారు. విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్లు, బస్‌డ్రైవర్లు, కూలీలకు గంజాయితో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. మెడికల్ షాపుల్లో అధిక మోతాదు మందుల విక్రయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రతిఒక్కరూ ఆధార్ కలిగి ఉండాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రతిఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, యూఐడీఏఐ స్టేట్ అసిస్టెంట్ మేనేజర్ నరేశ్‌తో కలిసి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 5 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలు 13,781 మంది ఆధార్ అప్‌డేట్ చేసుకోలేదని తెలిపారు. నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు బయోమెట్రిక్ హాజరు విధానం ఉంటుందని, ఆధార్ అప్‌డేట్ కాకపోతే సమస్య ఏర్పడుతుందన్నారు. పీవీటీజీ గ్రామాల్లో ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వందేళ్లు దాటిన వారి వివరాలు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలో 87 ఆధార్ నమోదు కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ఈ– డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతం రాజ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


