వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

ఆసిఫాబాద్‌: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం యాసంగి వరిధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ, సహకార, పౌరసరఫరాల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు సెర్ప్‌ ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రాలు, సహకార శాఖ ఆధ్వర్యంలో 19 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ గ్రేడ్‌ రకానికి క్వింటాల్‌ రూ.2,389, సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,369 చెల్లిస్తారని, సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు ప్రభుత్వం రూ.500 బోనస్‌ ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. విశాలమైన ప్రదేశాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వెలుతురు, టార్పాలిన్‌ కవర్లు, గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుతం కోతలు మొదలైనందున రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని తెలిపారు. వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోళ్లు పూర్తిగా ఓపీఎంఎస్‌ విధానంలో ఉంటుందని, విక్రయించే పద్ధతిపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, జిల్లా సహకార శాఖ అధికారి బి.మనోహర్‌, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ రజిత, కాగజ్‌నగర్‌ వ్యవసాయ శాఖ సంచాలకులు మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement