పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్‌..! | - | Sakshi
Sakshi News home page

పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్‌..!

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

బడుల పునఃప్రారంభం రోజే పంపిణీ చేసేలా కార్యాచరణ గోదాంలకు చేరిన 82శాతం టెక్ట్స్‌ బుక్స్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 62,315 మంది విద్యార్థులు

ఆసిఫాబాద్‌అర్బన్‌: 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేసవి సెలవులు ముగిసి జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బడి తలుపులు తెరిచిన తొలిరోజే విద్యార్థుల చేతులకు కొత్త పుస్తకాలు అందించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గతంలో ఎదురైన జాప్యాన్ని నివారించి, సకాలంలో విద్యార్థులకు అభ్యసన సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు విడతలవారీగా జిల్లా కేంద్రంలోని డిపోకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే 2,82,435 టెక్ట్స్‌ బుక్స్‌ అందుబాటులోకి వచ్చాయి.

వేసవిలోనే సరఫరా

జూన్‌ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పునఃప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు అందించనున్నారు. ప్రతీ విద్యార్థికి సకాలంలో పుస్తకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి సెలవుల్లోనే పూర్తిస్థాయిలో సరఫరా చేయనున్నారు. జిల్లాకు వందశాతం పాఠ్యపుస్తకాలు తెప్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే జూన్‌ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా 15 మండలాల పరిధిలోని 103 ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 106, ప్రాథమిక పాఠశాలలు 833 పాఠశాలలు ఉన్నాయి. ఆయా స్కూళ్లలో 62,315 మంది విద్యార్థులు చదువుతుండగా, 3.39లక్షల పుస్తకాలు అవసరం ఉంటాయని గుర్తించారు. ఇప్పటికే పార్ట్‌–1కు సంబంధించి 2,82,435 పుస్తకాలు జిల్లా కేంద్రంలోని డిపోకు చేరుకున్నాయి. మిగితావి మరో పదిరోజుల్లో చేరుకోనున్నాయి. జిల్లా డిపో నుంచి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు తరలించనున్నారు. మే చివరి వారం, జూన్‌ మొదటి వారంలో పాఠశాలలకు సరఫరా చేస్తారు. పార్ట్‌– 2కు సంబంధించి 2,95,380 పాఠ్య పుస్తకాలు వస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు నాటికి జిల్లాకు అవసరమైన పూర్తిస్థాయి పుస్తకాలు వస్తాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను కూడా ప్రభుత్వం అందిస్తోంది. ప్రతీ సబ్జెక్టుకు ఒక నోట్‌ పుస్తకం చొప్పున అన్ని సబ్జెక్టులకు అందించనున్నారు. వీటిని కార్గోల ద్వారా విద్యార్థుల సంఖ్య ఆధారంగా నేరుగా ఆయా పాఠశాలలకు పంపించనున్నారు.

ప్రారంభం రోజే పంపిణీకి ఏర్పాట్లు

2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభు త్వ పాఠశాలల విద్యార్థుల కు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల్లో 82 శాతం ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నా యి. మిగతావి సైతం పది రోజుల్లో రానున్నాయి. వచ్చిన పుస్తకాలను భద్రపరుస్తున్నాం. విద్యార్థుల కు ఇబ్బంది కలగకుండా పాఠ్య పుస్తకాలను ముందస్తుగానే సరఫరా చేస్తోంది. జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి ఎమ్మార్సీలకు పంపిస్తాం. స్కూళ్ల ప్రారంభం రోజే పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.

– రాథోడ్‌ ప్రకాశ్‌, పుస్తకాల డిపో మేనేజర్‌

జిల్లా వివరాలు

Advertisement
 
Advertisement
Advertisement