ఆసిఫాబాద్: వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో చేతిపంపులు, బోర్‌వెల్స్, పైప్‌లైన్‌లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. మారుమూల గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలన్నారు. చేతిపంపులు ఎండిపోతే ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బావులు, వ్యవసాయ పంపుసెట్లను గుర్తించి యజమానులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో దీపాలు పగటిపూట వెలగుకుండా ఆన్ ఆఫ్ స్విచ్‌బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ వందశాతం పూర్తయ్యేలా బీఎల్‌వోలకు సహకరించాలన్నారు. ఉపాధిహామీ పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రైతులు తమ వివరాలను నమోదు చేసుకునేలా వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, మిషన్‌గీరథ ఈఈ సిద్దిక్, భగీరథ గ్రేడ్ ఈఈ రాకేశ్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్ పాల్గొన్నారు.
విద్యార్థులకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ప్రతిభ చూపిన జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులను మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.హరిత అభినందించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు భువనగిరిలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో షూటింగ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు రవికుమార్, సోమశేఖర్, కోచ్‌లు రాకేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.


