ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉపశమన చర్యలు చేపట్టిన యాజమాన్యం మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చలువ పందిర్ల ఏర్పాటుతో ఉద్యోగులకు ఊరట పనివేళల మార్పుపై ఎటూ తేల్చని అధికారులు
రెబ్బెన: ఎండలకు సింగరేణి బొగ్గు గనులు భగభగ మండుతున్నాయి. ఎండలు, వడగాల్పుల నడుమ కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం 9 నుంచి భానుడు ప్రతాపం చూపుతుండగా.. సాధారణ ప్రాంతాల్లో పనిచేయడమే కష్టతరంగా మారింది. అలాంటి సింగరేణి బొగ్గు గనులు విస్తరించిన ప్రదేశాల్లో మరింత ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక ఓపెన్‌కాస్ట్‌ల్లో కార్మికుల పరిస్థితి ప్రాణసంకటంగా మారుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మండుటెండల్లో పనిచేసే కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు వడదెబ్బకు గురికాకుండా యాజమాన్యం ఉపశమన చర్యలు చేపడుతోంది. చల్లనీ నీటి సౌకర్యంతోపాటు మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందిస్తోంది. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో మాత్రమే ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి సాగుతోంది. పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు సుమారు 600 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
రక్షణగా చలువ పందిళ్లు
భూగర్భ గనులతో పోల్చితే ఎండాకాలం ఓసీపీల్లో విధుల నిర్వహణ కార్మికులకు కష్టతరంగా ఉంటుంది. ప్రధానంగా క్వారీ లోపల, డంపింగ్ యార్డులు ఇతర ప్రాంతాల్లో నిలువ నీడ కూడా అందుబాటులో ఉండదు. కార్మికులకు ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు ప్రతీ వేసవిలో సంస్థ చలువ పందిళ్లు ఏ ర్పాటు చేస్తుంది. ఈసారి సుమారు 20 వరకు చలు వ పందిళ్లను ఏర్పాటు చేశారు. ప్రధానంగా క్వారీ లోపలి భాగంలోని పంప్ స్టేషన్, ట్రిప్‌మెన్, కోల్‌యార్డుల వద్ద వీటిని ఏర్పాటు చేయగా.. ఉపరితలంలో కాఫర్‌బండ్, డంప్‌యార్డుల వద్ద ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా కర్రలతో పందిరిని ఏర్పాటు చేసి పైకప్పును తుంగ, ఇతర చల్లని నీడను ఇచ్చే వాటితో కప్పి ఉంచుతారు. కార్మికులు వేడిగాలులకు డీహైడ్రేషన్‌కు గురికాకుండా రంజన్లలో నీటిని అందుబాటులో ఉంచుతున్నారు.
పనివేళల్లో మార్పు ఎప్పుడో..?
ఓసీపీల్లో వేసవిలో పగలు విధుల నిర్వహణ కార్మికులకు నిప్పుల కుంపటిలో పనిచేయడంతో సమానంగా ఉంటుంది. దీంతో యాజమాన్యం అనేక ఉపశమన చర్యలు చేపట్టినా కొన్ని సందర్భాల్లో కార్మికులు అనారోగ్యానికి గురవుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సింగరేణి యాజమాన్యం ఎండల తీవ్రత తీవ్రరూపం దాల్చిన సమయంలో పనివేలు మార్చుతుంది. మొదటి షిప్టు సమయాన్ని ఒక గంట ముందుకు జరిపి, రెండోషిప్టును ఒక గంట ఆలస్యంగా ప్రారంభించేవారు. మధ్యాహ్నం కార్మికులకు కాస్త ఊరట లభించేది. అయితే ఈ ఏడాది మే ప్రారంభం కంటే ముందే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడే సుమారు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. మేలో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం ఓసీపీల్లో పనివేళల మార్పుపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
రెండు షిఫ్టుల్లో మజ్జిగ..
ఖైరిగూర ఓసీపీలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను మించి నమోదు అవుతుండటంతో కార్మికులు అల్లాడిపోతున్నారు. క్వారీ లోపల ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. బొగ్గు పొరల నుంచి వెలువడే వేడి, ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతతో అనారోగ్యం, వడదెబ్బకు గురికాకుండా యాజమాన్యం ప్రతిరోజూ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడంతోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతోంది. మొదటి, రెండో షిప్టుల్లో రోజుకు సుమారు 400 మందికి పైగా మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు.


