వినతులిచ్చి.. గోడు చెప్పుకుని | - | Sakshi
Sakshi News home page

వినతులిచ్చి.. గోడు చెప్పుకుని

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి(ఏవో) కిరణ్‌కుమార్‌ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా ఒంటరి మహిళ పింఛన్‌ మంజూరు చేయాలని వాంకిడి మండలం ఇందానికి చెందిన బొర్కుటె భారతి దరఖాస్తు చేసుకుంది. వితంతు పింఛన్‌ మంజూరు చేయాలని కాగజ్‌నగర్‌ పట్టణం నౌగాం బస్తీకి చెందిన ఇమాంబీ విన్నవించింది. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని ఇతరులు ఆక్రమించి సాగు చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆసిఫాబాద్‌ మండలం చిర్రకుంటకు చెందిన కుమ్రం నిర్మల దరఖాస్తు చేసుకుంది. తన పట్టా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతుబంధు ఇప్పించాలని ఆసిఫాబాద్‌కు చెందిన వైరాగడే లక్ష్మి దరఖాస్తు చేసుకుంది. తిర్యాణి మండలం దుగ్గాపూర్‌కు చెందిన రంగు కిరణ్‌ భూమి కొలతలు చేయాలని అధికారులను కోరాడు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రెబ్బెన మండలం గోలేటికి చెందిన పుస్తం పూజిత, ఆసిఫాబాద్‌ మండలం వావ్‌దమ్‌కు చెందిన మడావి రాంబాయి వేర్వేరుగా అర్జీలు అందించారు. సదరం సర్టిఫికెట్‌ ఇప్పించాలని కాగజ్‌నగర్‌ మండలం ఈజ్‌గాంకు చెందిన పరంజిత్‌ దరఖాస్తు చేసుకుంది. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement