సంతకు స్థలమేది..? | - | Sakshi
Sakshi News home page

సంతకు స్థలమేది..?

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

కౌటాల పశువుల సంతకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం

సొంత స్థలం లేక అటవీ భూమిలో నిర్వహణ

ఎండలకు అల్లాడుతున్న పశువులు, రైతులు

ప్రైవేట్‌ స్థలంలో పశువులు

కౌటాల: జిల్లాలోనే అతిపెద్ద సంత అయిన కౌటాల పశువుల సంతకు సొంత స్థలం లేకుండా పోయింది. ఏటా రూ.లక్షల ఆదాయం సమకూరుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం సొంత స్థలం కేటాయించకపోవడంతో అటవీ ప్రాంతంలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతీ సోమవారం నిర్వహించే కౌటాల పశువుల సంతకు కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్‌, సిర్పూర్‌(టి) మండలాలతోపాటు మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వందలాది మంది రైతులు వస్తారు. వందల సంఖ్యలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతాయి. గతంలో పశువుల సంతను స్థానిక బీరన్న ఆలయ ఆవరణలో నిర్వహించగా.. ఆలయ కమిటీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం స్థానిక మినీ స్టేడియం సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. అయినా అటవీశాఖ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు లేక పశువులు మృతి చెందుతుండగా.. అక్కడే అటవీ ప్రాంతంలోనే కళేబరాలను పడేస్తున్నారు. సమీప ప్రాంతాలు దుర్గంధంగా మారుతున్నాయి.

స్థలం కేటాయించాలి

కౌటాల పశువుల సంతలో రోజు వందల పశువులను రైతులు క్రయవిక్రయాలకు తీసుకొస్తారు. ప శువులకు తాగునీరు, పశుగ్రాసం అందించాలి. ముందుగా పశువుల సంతకు సొంత స్థలం కేటాయించాలి. – సురేశ్‌, కన్నెపల్లి

తాగునీటికి కటకట

ఇటీవల నిర్వహించిన సంత వేలం ద్వారా గ్రామ పంచాయతీకి రూ.38 లక్షల ఆదాయం సమకూరింది. సొంత స్థలం లేకపోవడంతో వసతులు కల్పించడం ఇబ్బందిగా మారింది. తాగునీటి వసతి లేకపోవడంతో పశువుల యజమానులు పడరాని పాట్లు పడుతున్నాయి. కనీసం నీడ కూడా లేకపోవడంతో గంటల తరబడి ఎండలో ఉంచుతున్నారు. ఇక రైతులు మాత్రం ఇంటి నుంచి బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. కొంతమందికి కొనుగోలు చేయడం తప్పడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు స్పందించి సొంత స్థలం కేటాయించి సౌకర్యాలు కల్పించాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement