ఆసిఫాబాద్‌అర్బన్: స్వీయ గణన ద్వారా జనగణన– 2027 కార్యక్రమం వేగవంతమవుతుందని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొదటి విడతలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన, రెండో విడతలో జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి నాణ్యమైన, స్పష్టమైన జాబితా రూపొందిస్తామని, ఇందుకోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. స్వీయ గణనపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, స్వయం సహాయక సంఘాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు స్వీయ గణన పోర్టల్ https:// se.census.gov.in అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఐడీ అందించవచ్చని తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు ప్రతిరోజూ వివరాలు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ప్రజలు వాస్తవ సమాచారం అందిస్తూ సహకరించాలని కోరారు. సమావేశంలో కార్యాలయ సిబ్బంది, మాస్టర్ ట్రైనర్లు, సాంకేతిక సహాయకులు పాల్గొన్నారు.


