ఆటాడేద్దాం..! | - | Sakshi
Sakshi News home page

ఆటాడేద్దాం..!

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

నేటి నుంచి జూన్‌ 7 వరకు వేసవి క్రీడాశిబిరాలు జిల్లాలో 10 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు నిపుణులతో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి దోహదం

జిల్లా కేంద్రంలో బాక్సింగ్‌ శిక్షణ పొందుతున్న విద్యార్థులు(ఫైల్‌)

తిర్యాణి: విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత క్రీడాశిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. శనివారం నుంచి జూన్‌ 7 వరకు విద్యార్థులకు వివిధ క్రీడాంశాల్లో నిపుణులతో శిక్షణ అందించనున్నారు. జిల్లా యువజన క్రీడల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే శిక్షణ కేంద్రాల నిర్వహణకు అర్హుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరిస్తోంది. కోచ్‌లకు ప్రభుత్వం గౌరవ వేతనం అందించనుండగా, శిక్షణ శిబిరాలకు అవసరమైన క్రీడాసామగ్రిని సైతం పంపిణీ చేయనుంది. జిల్లావ్యాప్తంగా పది శిబిరాలు ఏర్పాటు చేయనుండగా, అవసరానికి అనుగుణంగా వాటి సంఖ్య పెంచుతామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

ఉదయం, సాయంత్రం శిక్షణ

సమ్మర్‌ క్యాంపుల్లో గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాలను మరింత పదును పెట్టడంపై అధికారులు దృష్టి సారించనున్నారు. జిల్లావ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్న నేపథ్యంలో ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు శిక్షణ కొనసాగనుంది. ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ, స్విమ్మింగ్‌, నెట్‌బాల్‌, బాక్సింగ్‌, సెపక్‌తక్రా, బాల్‌బ్యాడ్మింటన్‌ వంటి క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కేంద్రాల నిర్వాహకుల నుంచి వస్తున్న దరఖాస్తులు, ప్రాధాన్యత ఆధారంగా వివిధ ప్రాంతాల్లో పది క్రీడాశిబిరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ మరో ఒకటి, రెండు పెంచుకునే సౌలభ్యం ఉంది.

సీనియర్లతో సూచనలు

వేసవి క్రీడాశిక్షణ కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా శిక్షణ కేంద్రాలకు వెళ్లేవారికి అక్కడ సీనియన్లు నుంచి మెలకువలు నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా క్రీడారంగాల్లో రాణించి ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొనడం, అర్హత సాధించడంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేసవి సెలవుల్లో చిన్నారులు చెడు వ్యసనాలకు అలవాటు కావడం, సెల్‌ఫోన్‌ వినియోగంతో సమయం వృథా చేయడం కాకుండా వారి శారీరక, మానసికోల్లాసానికి దోహదపడుతుంది. తల్లిదండ్రులు పిల్లలను సమీపంలోని క్రీడాశిబిరాలకు పంపించాలని అధికారులు సూచిస్తున్నారు.

సమ్మర్‌ క్యాంప్‌కు వెళ్తా..

చిన్నప్పటి నుంచి వాలీబాల్‌ ఆడటం చాలా ఇష్టం. కానీ ఆడించే వారు లేకపోవడంతో ఆటను పూర్తిగా నేర్చుకోలేపోతున్నా. సమ్మర్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తే వెళ్లి ఆటలో మెలకువలు నేర్చుకుంటా. ఎప్పటికై నా రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాలనేది నా కోరిక.

– జుంగోని దీక్షిత్‌గౌడ్‌, విద్యార్థి, తిర్యాణి

గ్రామీణ క్రీడలపై దృష్టి

వేసవి క్రీడాశిక్షణ కేంద్రాల నిర్వహణలో భాగంగా ఈ ఏడాది గ్రామీణ క్రీడలపై దృష్టి సారించాం. కోచింగ్‌ ఇచ్చేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ నెల 25 నుంచి జూన్‌ 7 వరకు జిల్లాలోని పది ప్రాంతాల్లో ఈ కేంద్రాలు నిర్వహిస్తాం. ఉదయం పూట రెండు గంటలు, తిరిగి సాయంత్రం రెండు గంటల పాటు శిక్షణ అందిస్తారు.

– ఆశ్ఫక్‌, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement