రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది విద్యార్థుల కోసం వేసవి క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. వాలీబాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ క్రీడల్లో శిక్షణ అందించనున్నారు. శిక్షణ కోసం గోలేటిలోని భీమన్న స్టేడియాన్ని ఎంపిక చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. శిక్షకులకు పారితోషకం అందించడంతోపాటు శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారులకు స్నాక్స్ సైతం యాజమాన్యం సమకూర్చనుంది. ప్రస్తుతం శిక్షకుల ఎంపిక కోసం ఆసక్తి గల రాష్ట్ర, జాతీయ స్థాయి, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. శిక్షకుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగానే కేంద్రాలు ప్రారంభించనున్నారు. శిబిరాల నిర్వహణ తేదీ ప్రస్తుతానికి నిర్ధారణ కాకపోయినా వచ్చే వారంలో ప్రారంభించే అవకాశం ఉంది. 25 రోజులపాటు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇవ్వనున్నారు. విద్యార్థులకు క్రీడల్లో మెలకువలు నేర్పించేందుకు నియమించే శిక్షకులకు పారితోషకంగా రూ.3400 అందించనున్నారు. విద్యార్థులు ఒకపూట స్నాక్స్ సైతం యాజమాన్యం అందిస్తుంది. వేసవి సెలవులు వృథా చేసుకోకుండా తమకు నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించుకోవాలని సింగరేణి అధికారులు కోరారు.


