ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి శుక్రవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ఉట్నూర్– ఆసిఫాబాద్ రహదారి పనులకు కాంట్రాక్టర్‌కు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, అసంపూర్తిగా ఉన్న కెరమెరి, లక్మాపూర్ వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. కెరమెరి మండలం కోట పరందోళి జంగుబాయి దేవస్థానం కమిటీకి 2024 సంవత్సరానికి సంబంధించి రూ.10లక్షల బకాయిలు విడుదల చేయాలన్నారు. అనంతరం ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సంతోష్‌కు వినతిపత్రం అందించారు. సమీప పీహెచ్‌సీల వైద్యులు వారానికి ఒకసారి పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు.


