రెబ్బెన: ఇందిరానగర్ గ్రామపంచాయతీలో హరితహారం మొక్కల నరికివేతపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీడీవో శంకరమ్మతో పాటు ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలను పచ్చదనంతో నింపేందుకు రూ.లక్షలు వెచ్చించి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారన్నారు. ఇందిరానగర్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ప్రధాన రహదారి వెంట ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా రోడ్డుకు ఇరువైపుల గతంలో నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలుగా మారాయన్నారు. పంచాయతీ తీర్మానం లేకుండానే నిర్లక్ష్యంగా సుమారు 40కి పైగా చెట్లను మొదటికి నరికివేశారని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, పచ్చదనాన్ని అందించిన చెట్లు మోడుగా మారిపోయాయని తెలిపారు. చెట్లను నరికివేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం రెబ్బెన అటవీశాఖ రేంజ్ అధికారులు ఇందినగర్‌కు వెళ్లి నరికిన చెట్లను పరిశీలించారు. కార్యక్రమాల్లో గ్రామస్తులు గుండేటి స్వామి, రమేశ్, దుర్గం తిరుపతి, రావూజీ, సంతోష్, వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.


