కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన అవ్తారే లింబాజీ(69)– పెంటుబాయి దంపతుల రెండో కుమారుడు కుశబ్‌రావు కూలీ పనిచేస్తున్నాడు. కుశబ్‌రావు ఈ నెల 14న మద్యం తాగి ఇంటికి వచ్చి తండ్రితో పెళ్లి విషయమై గొడవపడ్డాడు. తనకు పెళ్లి చేయడం లేదని, బంధువుల వద్ద చెడుగా చెబుతానడనే అనుమానంతో తండ్రి లింబాజీపై మద్యం మత్తులో దాడి చేశాడు. లింబాజీ కడుపులో తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు.
వడుగురే గణేశ్(42) భార్య సరోజతో కలిసి సిర్పూర్(టి) మండలం చీలపెల్లి గ్రామంలోని అత్తగారింట్లోనే ఉంటున్నాడు. గణేశ్ మద్యానికి బానిసకావడంతో గత నెల 29న మద్యం మత్తులో తన మామ భూమయ్యతో గొడవపడ్డాడు. భూమయ్య అల్లుడి చెంపపై బలంగా కొట్టి నెట్టివేయడంతో గణేశ్ కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య సరోజ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఇంటి పెద్దను కోల్పోయారు.
కౌటాల: ప్రశాంతమైన గిరిజన జిల్లాలో హత్యల సంస్కృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ కలహాలు, ఆస్తి తగదాలు, వివాహేతర సంబంధాలు, భూవివాదాలతో సొంతవారినే కడతేరుస్తున్నారు. రక్త సంబంధీకులే రక్తం కళ్లజూస్తున్నారు. జిల్లాలో గంజాయి, మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మత్తుకు బానిసగా మారినవారు మానవత్వాన్ని మరిచి అయినవారినే చంపుకోవడం సమాజానికి మాయనిమచ్చగా మిగులుతున్నాయి. హత్యలతో కుటుంబాలు రోడ్డున పడుతుండగా, బాధితుల పిల్లలు అనాథలుగా మారున్నారు. చంపిన వారు జైలు పాలవుతున్నారు. ఇరు కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. మద్యం మత్తు, గంజాయి వ్యసనం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. టోల్‌ఫ్రీ నంబర్ 14446కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.
కారణాలు అనేకం
జిల్లాలో ఎక్కువగా మత్తు, క్షణికావేశంలో హత్యలు జరుగుతున్నాయి. భూతగాదాలు, వివాహేతర సంబంధాలు సైతం ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. చిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ తమ జీవితాలను జైలు పాలు చేసుకుంటున్నారు. ఏటా పదుల సంఖ్యలో హత్య, హత్యయత్నం కేసులు నమోదవుతున్నాయి. వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా కుటుంబాలు సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి నెలకొంటుంది. పెంచికల్‌పేట్ మండలంలో జరిగిన యువతి హత్య ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. కొండపల్లికి చెందిన ఆత్రం సమ్మక్క(25)తో జైహింద్‌పూర్‌కు చెందిన వివాహితుడు కేర్కరి జలపతి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అతడి కారణంగా సమ్మక్క గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో సమ్మక్కను మార్చి 14న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు. అలాగే ఈ నెల 8న చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద మహారాష్ట్ర యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నేరాల నియంత్రణకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చట్టాలపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో ఘటనల వివరాలు


