నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12న పునఃప్రారంభం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేత
కెరమెరి: 2025– 26 విద్యాసంవత్సరం ముగిసింది. గురువారం పాఠశాలలకు చివరిదినం కాగా, శుక్రవారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు ఖుషీ ఖుషీగా ఇంటిబాట పట్టారు. ఆశ్రమ పాఠశాలల్లో చివరి పరీక్ష ముగియగానే హాస్టళ్ల నుంచి వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించారు.
చివరిరోజు సందడే సందడి
జిల్లాలో 1,273 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా 89 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నా రు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమి కోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగులు నిర్వహించారు. తల్లిదండ్రుల ఎదుటే పిల్లల ప్రగతిపత్రాలు అందించారు. ఏడాది పాటు చదివిన తీరును విషదీకరించారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు.
బడి ఆస్తులు భద్రమేనా?
జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల ఆస్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విలువైన సామగ్రి చోరీకి గురి కావడం, ధ్వంసం కావడం గతంలో పలుచోట్ల జరిగింది. పాఠశాల పరిసరాల్లో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఆస్తులు కాపాడేందుకు వాటి రక్షణకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. క్యాంపస్ కమాండోస్‌గా విద్యార్థులకు బాధ్యతలు అప్పగించారు. విద్యార్థులు తరచూ బడిని సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించాలి. సాయంత్రం బడి మైదానంలో ఆడుకోవాలని సూచించారు. వీరు సైన్స్ ప్రయోగశాలలు, ల్యాబ్‌లో విలువైన పరికరాలు, కంప్యూటర్లు, క్రీడాసామగ్రి, పుస్తకాలు, నీటి శుద్ధి పరికరాలు, విద్యుత్ మోటార్లు చోరీ కాకుండా పర్యవేక్షించాలి. డిజిటల్ పాఠ్యాంశాల కోసం అందించిన ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డులు, విలువైన ఫర్నీచర్, అడ్మిషన్ రిజిస్టర్, రికార్డులు, మిగిలిన ఎండీఎం బియ్యం భద్రతకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


