ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సును నడిపేందుకు ప్రయత్నించగా, జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్‌తో మహిళా కండక్టర్లు వాగ్వాదానికి దిగారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో నుంచి ఉదయం బస్సులు బయటకు వెళ్లకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. ఎట్టకేలకు అధికారులు ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లతో బస్సులు నడిపారు. ఆసిఫాబాద్ డిపో నుంచి తొమ్మిది బస్సులు కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, వాంకిడి రూట్లతో నడిపించారు. కండక్టర్ లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు పురుషులకు సైతం ఉచిత ప్రయాణం కల్పించారు. కాగజ్‌నగర్ బస్‌స్టేషన్ మీదుగా కౌటాల, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్‌పేట్ మండలాలకు వెళ్లే బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగజ్‌నగర్‌లోని బస్టాండ్‌లో ప్రయాణికులు గంటల తరబడి వేచిచూశారు.


