మక్కల కొనుగోళ్లు షురూ | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లు షురూ

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

● పెరిగిన మొక్కజొన్న సాగు ● తేమశాతం 14లోపు ఉంటేనే మద్దతు ధర

కాగజ్‌నగర్‌టౌన్‌: ఈ ఏడాది మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని దహెగాం, కాగజ్‌నగర్‌, పెంచికల్‌పేట్‌, బెజ్జూర్‌, కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్‌(టి) మండలాల్లో సుమారు 13వేల ఎకరాల్లో రైతులు పంటను సాగు చేశారు. ప్రస్తుతం కోతలు పూర్తికావడంతో రైతులు పంటను అమ్మేందుకు సిద్ధమయ్యారు. కాగజ్‌నగర్‌లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 చెల్లిస్తున్నారు.

తేమ నిబంధనలు ఇలా..

కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే మక్కల్లో పీఏసీఎస్‌ సిబ్బంది మాయిశ్చర్‌ మీటర్‌తో తేమశాతాన్ని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 శాతానికి మించితే కొనుగోలు చేయడం లేదు. తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని వెనక్కి తిప్పి పంపి ఆరబెట్టుకుని రావాలని సూచిస్తున్నారు. 14 శాతం లోపు ఉంటేనే తూకం వేసి క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధర చెల్లిస్తున్నారు. కేంద్రం వద్ద రైతు పేరు, ఆధార్‌, ఫోన్‌ నంబర్‌, బ్యాంక్‌ఖాతా, పట్టాదారు పాస్‌బుక్‌ జిరాక్స్‌, తేమ శాతం తూకం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. టోకెన్‌ ఇచ్చిన 48 గంటల్లో రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరుపుతున్నట్లు పీఏసీఎస్‌ కార్యదర్శి సతీశ్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement