ఆసిఫాబాద్‌రూరల్: ఇంటర్‌తోనే విద్యార్థులు ఉపాధి అవకాశాలు సృష్టించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హెల్త్ కేర్, మల్టీమీడియా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, హైటెక్ టైలర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మల్టీపర్పస్ వర్కర్, డెయిరీ టెక్నాలజీ వంటి వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 10 వరకు జిల్లా కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులకు హెల్త్ కేర్, మీడియా రంగాలపై పదిరోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందించారు.
ఆరు ఒకేషనల్ కాలేజీలు
జిల్లాలో మొత్తం 49 జూనియర్ కళాశాలలు ఉండగా, ఇందులో 11 ప్రభుత్వ కళాశాలలు, 5 ప్రైవేట్, మిగిలినవి కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ కళాశాలలు. ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్, కౌటాల, ఆసిఫాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్, ఎస్టీ బాలికల గురుకుల కళాశాలల్లో వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు ఇంటర్, వృత్తి విద్య కోర్సు చదువుతూనే వారికి ఇష్టమైన అంశంలో ఉచిత శిక్షణ కల్పిస్తారు. ఇది భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడనుంది. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో 10 నుంచి 15 రోజులపాటు ఎంచుకున్న కోర్సుపై సమీపంలోని పరిశ్రమ, ఆస్పత్రులు, ఫొటోషాప్, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మల్టీపర్సన్, హెల్త్ వర్కర్ వంటి టెక్నాలజీలపై శిక్షణ అందించి ధ్రువీకరణ పత్రం అందిస్తారు. ఈ కోర్సుల్లో 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్ ద్వారా నేర్చుకుంటారు.


